Aug 21,2020 07:44

ఈ ఏడాది జూన్‌ 24న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచబ్యాంకుతో మూడవ విడత రుణం కోసం ఒప్పందం ఖరారు చేసుకుంది. స్టార్స్‌ (స్ట్రెందెనింగ్‌ టీచింగ్‌-లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌ ప్రోగ్రాం) అనే ఈ ప్రాజెక్టు ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యారంగంలో వ్యవస్థను, బోధన సారాంశాన్ని, అజమాయిషీని ఈ ప్రాజెక్టు చేపడుతుంది. 1993-2002 మధ్య డిపెప్‌, 2002 నుంచి సర్వశిక్షా అభియాన్‌ మొదటి రెండు విడతలకు సంబంధించి అమలు చేసిన ప్రాజెక్టులు. ఒక నెల తర్వాత జూలై 30న 'నూతన విద్యా విధానం-2020' (ఎన్‌ఇపి)ని కేంద్ర క్యాబినెట్‌ ఖరారు చేసిందని, వెంటనే ఇది అమలు లోకి వస్తుందని మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. అటు ప్రపంచబ్యాంకుతో ఒప్పందం ఖరారు, ఇటు ఎన్‌ఇపి-2020 ని ఆమోదించడం, రెండూ కోవిడ్‌-19తో యావద్దేశమూ సతమతమౌతూ బైటపడే దారి దొరకక నానా యాతనలూ పడుతున్న సమయంలోనే జరిగాయి. ఆర్థిక వ్యవస్థ చతికిలబడింది. లక్షల సంఖ్యలో వలస కార్మికులు పనులు లేక స్వగ్రామాలకు తిరిగి వచ్చేశారు. మార్చి నుండి విద్యా సంస్థలన్నీ మూతబడ్డాయి. పరీక్షలు ఆగిపోయాయి. విద్యార్ధులలో తీవ్ర గందరగోళం, ఆందోళన నెలకొన్నాయి. విద్యా రంగం గురించి కేంద్ర క్యాబినెట్‌ గనుక పట్టించుకోదలిస్తే ఈ సమస్యలన్నింటినీ చర్చించి తక్షణం అమలుకు పూనుకోవాలి. కాని ఈ ప్రభుత్వం అలా చేయలేదు.
ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కోవిడ్‌-19 సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి ప్రజాస్వామ్య పద్ధతులనూ పాటించకుండా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయదలచుకున్న వారికి అవకాశం ఇవ్వకుండా నయా ఉదారవాద సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కార్మిక చట్టాలను మార్చి సమిష్టి బేరసారాల హక్కును దెబ్బతీసింది. ప్రభుత్వ రంగాన్ని, రైల్వేలను, విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నది. బ్యాంకుల్ని విలీనం చేసింది. పర్యావరణకు హాని కలిగించే ప్రాజెక్టులను శరవేగంగా ఆమోదించింది. అదే విధంగా ఈ ఎన్‌ఇపి-2020ని కూడా ఆమోదించింది.
ప్రాజెక్టు ఖర్చు-ప్రపంచబ్యాంకు రుణం
ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి దాకా అందరు పిల్లలకూ నాణ్యతగలిగిన విద్యను అందుబాటు లోకి తేవడం లక్ష్యం అని అటు ప్రపంచబ్యాంకు, ఇటు ఎన్‌ఇపి- రెండూ ప్రకటించాయి. దీనిని చూసి ఎవరైనా ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు భారీగా రుణం ఇవ్వనుందని అనుకోవచ్చు. అయితే, ఈ స్టార్స్‌ ప్రాజెక్టుకు, దానిని అంతర్భాగంగా కలిగివున్న సమగ్ర శిక్షా అభియాన్‌ కు అయ్యే మొత్తం ఖర్చులో ప్రపంచబ్యాంకు రుణం వాటా కేవలం 1.4 శాతం మాత్రమే. మిగిలిన 98.6 శాతం ఖర్చునూ కేంద్రం, రాష్ట్రాలు భరించాలి. అయినప్పటికీ ప్రపంచబ్యాంకుకు ఈ ప్రాజెక్టు అమలులో, లోతుగా జోక్యం చేసుకునే వీలు కల్పించారు. విద్యా రంగంలో ముందున్న కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల లోను, ఇప్పుడిప్పుడే 'నేర్చుకుంటున్న' మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల లోను ముందు కేంద్రీకరిస్తారు. ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టులో బోధన, అధ్యయనం పద్ధతులను రూపొందించడం, ఉపాధ్యాయులకు శిక్షణ గరపడం, మెరిట్‌ ప్రాతిపదికన ఫలితాలను అంచనా వేయడం, తల్లిదండ్రులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేలా వారికి శిక్షణ ఇవ్వడం, అధికారులకు నిర్వహణ విషయంలో శిక్షణనివ్వడం వంటి పలు అంశాలలో భాగం పంచుకుంటుంది.
ఇప్పుడు మనకొక సందేహం రావొచ్చు. పైన పేర్కొన్న పనులన్నీ చేయడానికి ఈ ప్రపంచబ్యాంకు ఏమైనా ఒక అంతర్జాతీయ విద్యా సంస్థా? కాకపోతే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో దాని జోక్యం ఎందుకు అనుమతిస్తున్నారు? గతంలో చేసుకున్న జోక్యం వలన ఎటువంటి ఫలితాలు వచ్చాయి? ప్రపంచబ్యాంకు ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకు అనుగుణంగా అది మార్కెట్లను సృష్టిస్తుంది, అదుపుచేస్తుంది, ప్రభావితం చేస్తుంది. దానికి విద్యా రంగంతోగాని బోధనా విధానాలతోగాని, మన వంటి వెనుకబడ్డ దేశాలలో నాణ్యతగల చదువుకు నోచుకోని పేద విద్యార్థులతోగాని ఏ సంబంధమూ లేదు. అయితే 1980 దశకం నుండి ప్రపంచబ్యాంకు ప్రధానంగా గతంలో వలసలుగా ఉన్న దేశాలపై కేంద్రీకరించింది. విద్యా రంగానికి ప్రభుత్వ వనరులను కేటాయించడం బదులు ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని, 'ప్రభుత్వేతర పాత్రధారుల' ప్రవేశానికి వీలు కల్పించాలని ఆదేశాల ప్రభుత్వాలపై వత్తిడి తేవడం మొదలుబెట్టింది. ఈ ప్రభుత్వేతర పాత్రధారులంటే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, సేవా, దాతృత్వ సంస్థలు, మత ధార్మిక సంస్థలు, వాలంటీర్లు- ఎవరైనా కావొచ్చు. ఈ ఎన్‌ఇపిలో ప్రైవేటు సంస్థలు అనేబదులు దాతృత్వ, సేవా సంస్థలు అని ఉటంకిస్తూ అవి నిర్వహించగల పాత్రను ఆకాశానికి ఎత్తేస్తూ వాటికి పెద్దపీట వేశారు.
'పాఠశాలల మధ్య సహకారం, సానుకూల సమన్వయం (పాజిటివ్‌ సినెర్జీ) పెరిగేలా దేశవ్యాప్తంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలతో ఒక్కో ప్రైవేటు పాఠశాలను జత చేయడం జరుగుతుంది. ఇలా జత చేయబడిన స్కూళ్ళు పరస్పరం సంప్రదించుకోవడం, నేర్చుకోవడం, వనరులను పంచుకోవడం వంటివి చేస్తాయి. ప్రైవేటు స్కూళ్ళలో అమలయ్యే ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి ప్రభుత్వ స్కూళ్ళలో అధికారికంగా అమలు జరిగేలా చేయవచ్చు. కుదిరిన చోట్ల ప్రభుత్వ పాఠశాలల లోని ఉత్తమ పద్ధతులనూ ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయవచ్చు' అని ఎన్‌ఇపి పేర్కొంది (పేరా 7.10). ఈ తరహా 'పాత్రధారుల' ప్రవేశంతో విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వానికి బాధ్యత, అందులోని పరిస్థితుల, పరిణామాల పట్ల జవాబుదారీతనం-రెండూ లేకుండా పోతాయి.
18 రాష్ట్రాల్లో, దేశం లోని సగం పైగా జిల్లాల్లో అమలు జరిగిన డిపెప్‌ ప్రోగ్రాం అనుభవం ఏమిటి? మరింత ఎక్కువ మందికి విద్యను అందుబాటు లోకి తేవడానికి, నాణ్యతను పెంచడానికి 'తక్కువ ఖర్చుతో' రూపొందించిన ఆ కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు వేగంగా దిగజారిపోడానికి, దళిత, గిరిజన, ఒబిసి, మైనారిటీ విద్యార్ధులు ఎవరైతే ఈ స్కూళ్ల పైనే ప్రధానంగా ఆధార పడ్డారో వారే వాటి మీద విశ్వాసం కోల్పోవడానికి దారితీసింది. ఫలితంగా ప్రైవేటీకరణ, పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం పెరిగాయి. తక్కువ ఫీజులను వసూలు చేసే స్కూళ్ళు విపరీతమైన వేగంతో విస్తరించాయి.
ఈ నష్టాన్ని పరిగణించకుండానే మళ్ళీ ప్రపంచబ్యాంకు జోక్యంతో 2002 నుండి సర్వశిక్షా అభియాన్‌ మొదలైంది. విద్య ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టం సైతం 25 శాతం పేద విద్యార్థులను ప్రైవేటు స్కూళ్ళలో చేర్చుకోవాలంటూ ప్రైవేటు విద్యకు ఒక విధంగా చట్టబద్ధమైన సమర్థన కూడా చేసింది. విద్యాబోధన నాణ్యంగా జరగడానికి, ఫీజు చెల్లించగల స్తోమతకు లంకె పెట్టి విద్యను పేదలకు దూరం చేసే ప్రైవేటు విద్య అసలు స్వభావాన్ని ఆ చట్టం విస్మరించింది. ఇంత జరిగాక కూడా ప్రభుత్వం అదే ప్రపంచ బ్యాంకు మూడో విడత జోక్యానికి సమ్మతించి ఒప్పందం చేసుకుంది. 1986నాటి ఎన్‌ఇపి తర్వాత ఇది కొత్త పుంతలు తొక్కిన నూతన విద్యా విధానం అని ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. గత ప్రభుత్వాలు, ప్రపంచబ్యాంకు చేపట్టిన పంథానే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు.
ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించడం ప్రపంచబ్యాంకు వ్యూహంలో కీలకమైనది. అంతే తప్ప అందులో విద్య నాణ్యతను మెరుగు పరిచే లక్ష్యం అంటూ ఏదీ లేదు. దీని పర్యవసానంగా ఇప్పటికే వెనకబడిన, అవకాశాలు నిరాకరించబడుతున్న తరగతుల పిల్లలంతా మరింతగా విద్యకు దూరం అవుతారు. దేశమంతటా అందరికీ నాణ్యతగలిగిన విద్యను అందించాలన్నది మన రాజ్యాంగ లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి పూర్తిగా వైదొలగేందుకే ఈ ఎన్‌ఇపి దారితీస్తుంది. మార్కెట్‌ శక్తుల ఇష్టంమేరకు స్తోమతగలవారికొక చదువు, అది లేనివారికి ఇంకొక తరహా చదువు అందించే వివక్షతతో కూడిన విద్యా విధానం ఈ ఎన్‌ఇపి. తల్లిదండ్రులందరూ తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించడానికి మొగ్గు చూపేటట్లు చేయడానికి తగిన విధంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని ఒక వైపు చెప్పింది. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చేందుకు వీలుగా ప్రభుత్వ విధానం ఉండాలని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన, బలహీన వర్గాల వారితో సహా అందరూ చదువుకోడానికి వీలుగా ఇప్పుడున్న నియతవిద్యకి తోడు అనియత విద్యను కూడా ప్రారంభించాలని చెప్పింది. ఇందుకోసం ఓపెన్‌ స్కూళ్లు, దూర విద్య మరింత బలోపేతం అవాలని, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఓపెన్‌ స్కూళ్ళను మరింతగా బలోపేతం చేయనున్నట్టు పేర్కొంది. పాఠశాలలకు నేరుగా పోయి చదువుకోలేని వారంతా ఈ ఓపెన్‌ స్కూళ్ళ ద్వారా చదువుకోవచ్చునని సూచించింది. ప్రాథమిక విద్యలో 3,5,8 తరగతుల స్థాయికి సమానంగా ఒక గ్రేడ్‌ లోను, 10, 12 తరగతులకు సమానంగా ఉండే మరో గ్రేడ్‌ లోను, వృత్తివిద్యా శిక్షణ కోర్సులు, వయోజన విద్య, జీవితాలను సుసంపన్నం చేసుకునే విద్య(?) వంటివి ఇతర గ్రేడ్‌ల లోను రూపొందించనున్నారు. ప్రాంతీయ భాషల్లో వీటిని అందిస్తారు. ఉపకార వేతనాలు, తల్లిదండ్రులకిచ్చే నగదు ప్రోత్సాహకాలు (అమ్మవొడి వంటివి), సైకిళ్ళను ఇవ్వడం వంటివి మరింత ఎక్కువగా చేపట్టాలని సూచించింది. అదే సమయంలో ప్రభుత్వేతర సంస్థలు స్కూళ్ళను నిర్మించడానికి ముందుకు రావాలన్నా, ఆయా స్థానిక, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ నమూనాల్లో స్కూళ్ళు నడపాలన్నా నిబంధనలను మరింత సరళతరం చేయాలి అని ఈ పత్రంలో నిర్దేశించారు. అంటే ఇప్పుడున్న అరకొర నిబంధనలను సైతం ప్రైవేటు స్కూళ్ళకు అనుకూలంగా సడలించనున్నారు.
ఇక ఇసిసిఇ (ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌) వరకూ ఏమైనా కొత్త దిశానిర్దేశం ఉందా అంటే అటువంటిదేదీ కనపడదు. దీనిని పాఠశాల వ్యవస్థలో అంతర్భాగంగా చేసేందుకు ఎటువంటి ప్రతిపాదనలూ లేవు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, అక్కడ నాణ్యతగలిగిన మౌలిక వసతులు కల్పించాలని, అంగన్‌వాడీలకు శిక్షణ గరపాలని చెప్పినవన్నీ పాత సూచనలే. ఈ అంగన్‌వాడీ కేంద్రాలను స్కూల్‌ కాంప్లెక్స్‌లతో అనుసంధానం చేస్తారు. 10వ తరగతి, ఆపైన చదివిన అంగన్‌వాడీలకు 6 నెలలు, అంతకన్నా తక్కువ చదివిన వారికి ఏడాది పాటు శిక్షణనిస్తారు. అయితే వీరంతా తమ తమ ప్రస్తుత మంత్రిత్వశాఖ పరిధిలోనే కొనసాగుతారు తప్ప అందరినీ ఒక శాఖ పరిధి లోకి తీసుకురారు. విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఆయా శాఖలలోనే కొనసాగుతారు. ఇంకెలా ఏకీకృత విద్యా వ్యవస్థగా ఇసిసిఇ పెంపొందగలుగుతుంది? గిరిజన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఆశ్రమశాలలు ఏర్పరుస్తామని, ప్రత్యేకంగా వీటిని నడుపుతామని ఇందులో ఒక చోట ప్రస్తావించారు. అంటే తక్కిన విద్యా వ్యవస్థ నుండి వీటిని విడదీసి వేరేగా నడుపుతారా లేక ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి విద్యా వ్యవస్థలో భాగంగానే నడుపుతారో తెలియదు. దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

('ఎన్‌ఇపి కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే' రేపటి సంచికలో)
                                                                                       * మధు ప్రసాద్‌ (వ్యాసకర్త జాతీయ విద్యా హక్కు వేదికకు చెందినవారు)