ప్రజాశక్తి-మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాదయాత్ర శుక్రవారంతో ముగిసింది. ముగింపు సభ మార్కాపురం పట్టణంలోని నాయుడు బజారులో రాత్రి ఏర్పాటు చేశారు. ఈ సభలో వైసిపి నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టును వైసిపి గాలికి వదిలేసిందన్నారు. 2024లో టిడిపి అధికారంలోకి వస్తుందని, వెలిగొండ ప్రారంభిస్తామని చెప్పారు. మార్కాపురం జిల్లా అవసరమని, తాము జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పశ్చిమ ప్రాంత ప్రజల కోసం పాదయాత్ర చేపట్టిన కందుల నారాయణరెడ్డి ఆ పార్టీ నాయకులు అభినందించారు.










