గోతులమయంగా తూర్పువీధిలో రోడ్లు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అనే చందంగా తయారయ్యాయి నగరంలో రోడ్లు. ఏలూరు నగరం నానాటికీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పాలకులు చెబుతుంటే మరోపక్క పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి నగరంలోని పలు ప్రాంతాల రోడ్లు. దీనికి ఏలూరు నగరంలోని తూర్పువీధి ప్రాంతంలో ఉన్న రోడ్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏలూరు నుంచి కొల్లేటి ప్రాంతాలైన గుడివాకలంక, కైకలూరు ప్రాంతాలను కలుపుతూ ఉన్న తూర్పువీధి నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి కీలకప్రాంతమైన ఇక్కడ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. తూర్పువీధి పెట్రోలు బంకు నుంచి గుడివాకలంక వెళ్లే మార్గంలో చాటపర్రు రోడ్డు గోతులమయంగా మారింది. దీంతోపాటుగా తూర్పువీధి నుంచి కైకలూరుకు వెళ్లే మార్గం మరీ దారుణంగా తయారైంది. ఈ రెండు మార్గాల్లో పెద్దపెద్ద గోతులు పడ్డాయి. దీంతో ఇటుగా రాకపోకలు సాగించడానికి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వీధిదీపాలు కూడా సక్రమంగా వెలకగకపోవడంతో చీకటిలో ఈ గోతుల్లో పడి పలువురు గాయాలపాలైన సంఘటనలూ ఉన్నాయి. ఇక చినుకుపడితే చాలు ఎక్కడ గొయ్యి ఉందో? ఎక్కడ రోడ్డు బాగుందో? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరగడం వల్ల ఇలా గోతులు పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలను మళ్లించడంతో పాటుగా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.










