Nov 30,2022 22:06

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
            మహాకవి గురజాడ అప్పారావు అందరికీ మార్గదర్శకులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన గురజాడ వర్థంతిసభలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. ముందుగా గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గురజాడ కన్యాశుల్కం నాటకంతో తెలుగు నాటకరంగం నూతన ఒరవడితో పాటు మహిళ అభ్యుదయమనే వాస్తవాన్ని తెలుగు ప్రజల ముందుంచారన్నారు. దేశమంటే మట్టి కాదంటూ నిజమైన దేశభక్తి అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. తిరుమల ఛాందసవాద చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వడం ఆయనను అవమానించడమేనన్నారు. తిరుగమన భావాలకు పెద్దపీఠం వేసినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టి.రామకృష్ణ, డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎం.జీవరత్నం, నరసింహారావు, పిల్లి రామకృష్ణ, కిషోర్‌, మంగరాజు, టి.నాగమణి, ఎస్‌కె.సుభాషిణి పాల్గొన్నారు.
ఏలూరు:శ్రీకృష్ణ దేవరాయ కార్పొరేషన్‌ హై స్కూల్లో ఎవిఆర్‌ విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో గురజాడ 107వ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు డి.కేదార్‌ అధ్యక్షత వహించారు. ఏలూరులోని తూర్పువీధి శ్రీకృష్ణ దేవరాయ స్కూల్లోని గురజాడ అప్పారావు విగ్రహానికి టీచర్స్‌ తరపున కేదార్‌, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం తరపున గుడిపాటి నరసింహారావు పూలమాలలు వేశారు. అనంతరం గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ గురజాడ స్త్రీల పక్షపాతిగా చేసిన రచనలు వివరించారు. పాత్రోచిత భాష, మధుర వాణి కథానాయికగా ఉండటం, కన్యాశుల్కం నాటకం గొప్పదనం అని, అలాంటి రచన ఇప్పటికీ మరొకటి రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాణిక్యాలరావు, ఎ.జ్యోతిబాబు, ఎన్‌ఎల్‌.రమ్య, జి.శిరీష, జి.సుధ, వి.గాయత్రి, సుజాత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.