
ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్: టీకా కార్యక్రమంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన మండలంలో పుట్టూరు, పెదబొండపల్లి, చినబొండపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బంది నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంత మంది చిన్నారులు, గర్భిణీలకు టీకా వేస్తున్నదీ ఆర్‌సిహెచ్ రిజిస్టర్లు, టీకా అర్హుల జాబితా పరిశీలించారు. టీకా కార్డులో గడువు తేదీలను పరిశీలించారు. అత్యవసర మందుల కిట్ (ఎఇఎఫ్‌ఐ), సిరంజీలు, హబ్ కట్టర్, వ్యాక్సిన్‌ను టీకా కేంద్రంలో తనిఖీ చేశారు. టీకా వేయడానికి ముందురోజు తెలియజేస్తున్నారా అని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. యూవిన్ పోర్టల్‌లో టీకా వివరాల ఆన్లైన్ నమోదు ఏ మేరకు చేస్తున్నారో మొబైల్‌లో పరిశీలించారు. ఐదేళ్లలోపు పిల్లల టీకా వివరాల సమాచారం పూర్తి స్థాయిలో యూవిన్, ఆర్సీహెచ్ పోర్టల్స్‌లో ఆన్లైన్ నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టీకాల ఆవశ్యకత పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం జగన్మోహనరావు పిల్లల, గర్భిణీల ఆరోగ్య పరిశీలన చేసి అవసరమైన సూచనలు చేశారు. నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ జయగౌడ్, ఎఎన్‌ఎంలు నాగలక్ష్మి, సుబ్బలక్ష్మి, కమలకుమారి, ఎంఎల్‌హెచ్‌పి సౌజన్య, పద్మా వతి, హెల్త్ అసిస్టెంట్ కన్నం నాయుడు, అంగన్వాడీ సిబ్బంది కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.