పార్వతీపురం: పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పుల ప్రతిపాదనలు కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల అవసరాలు అన్ని కోణాల్లో పరిశీలించి ప్రతిపాదించాలని స్పష్టం చేశారు. ఇవిఎంల అవసరాలు, భద్రత, రవాణా, అవసరమగు సిబ్బంది, గ్రామాల మధ్య దూరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు అదే గ్రామంలో ఓటు వేసే అవకాశం ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు తక్షణం సమర్పించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, డిఆర్‌ఒ జె.వెంకట రావు, హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు డి.రవి కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, టిడిపి, జనసేన, వైసిపి, సిపిఐ నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, పైల.శ్రీనివాస రావు, ఎం.గౌరీ శంకర్ రావు, ఈదుబిల్లి వెంకట నాయుడు పాల్గొన్నారు.










