ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై తీసుకుంటున్న చర్యలు, కొత్త ఇవిఎంల ఏక్సెప్టెన్స్ టెస్ట్ వివరాలు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి బుధ వారం సమావేశం నిర్వహిస్తూ జిల్లాలో చేపట్టిన ప్రక్రియను వివరిస్తున్నామన్నారు. వారి సూచనలతో పాటు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిమిత్తం ఫారం 6,7,8లు దరఖాస్తులు అందాయని, నిబంధనలకు అనుగుణంగా అన్నింటిని పరిశీలించడం జరిగిందని అన్నారు. ఓటర్ల సవరణలో భాగంగా ఫారం 6,7,8 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారీకి చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పిఒలు సి.విష్ణు చరణ్, కల్పనా కుమారి, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.










