ప్రజాశక్తి - అమలాపురం
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పు, పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 1,641 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 32 పోలింగ్ కేంద్రాల లొకేషన్ల మార్పు చేశామన్నారు. 90 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చినట్లు తెలిపారు. నూతనంగా మూడు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదిం చామన్నారు. అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెంలో, మండపేట మున్సి పాలిటీలో, కపిలేశ్వరపురం మండలం మాచర మట్టలు గ్రామంలో నూతన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. ఈ వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించి సందేహాలను నివృత్తి చేశారు. అక్టోబర్ 3 నుంచి నవంబర్ 18వరకూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తనిఖీల ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాకు 6వేల ఇవిఎంలు కేటాయించారన్నారు. నూతనంగా ప్రతిపాదించిన మూడు పోలింగ్ కేంద్రాలతో జిల్లా వ్యాప్తంగా 1,644 పోలింగ్ కేంద్రాలు అందు బాటులోకి రానున్నయన్నారు. 1,500 ఓట్లు దాటినచోట్ల రెండో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురితం అవుతుందని, నవంబర్ 30 వరకు చేర్పులు మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. జనవరి 5న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ సిహెచ్.సత్తిబాబు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.










