ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యంతో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లోని అన్ని ప్రక్రియలనూ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖరరావుతో కలసి ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్ 2024 ఓటర్లకు సంబంధించి వచ్చిన అన్ని క్లయిమ్‌లను ఎప్పటికప్పుడు ఈఆర్వోలు క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా సక్రమంగా విచారణ చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈఆర్వో నెట్‌లో అప్లోడ్‌కు ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసిన వెంటనే వివరాలను ఆన్లైన్‌లో అప్లోడ్ చేస్తారన్నారు. ఈవీఎంలను ఎన్నికలకు సిద్ధం చేయటానికి నిర్వహిస్తున్న ఫస్ట్ లెవల్ చెకింగ్ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా కొనసాగుతోందని చెప్పారు. సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ టి.సేవాకుమార్, బిఎస్‌పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సిహెచ్.వాసు, బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీ ఆర్.వెంకట భాస్కరరావు సిపిఎం నాయకులు వై.కృష్ణకాంత్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సునీల్, టిడిపి ప్రచార కార్యదర్శి ఎన్.ఓంకార్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఎ.జోసెప్ కుమార్, డీఆర్డీఏ పీడీ హరిహరనాధ్ , కలెక్టరేట్ కో-ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ కల్యాణి, తహశీల్దార్లు రాంప్రసాదు, ఫణీంద్రబాబు, జీఎంసీ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్, డీసీపీ కోటయ్య పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి