మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 26న భారత్‌బంద్ నిర్వహించాల్సిందిగా రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపును బలపర్చాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో బంద్‌ను విజయవంతం చేయాలని మార్చి 17న విజయవాడలో జరిగిన రాష్ట్ర రైతు మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ లోని కార్మిక సంఘాల సదస్సు తీర్మానించింది. అనేక విద్యార్థి, యువజన సంఘాలు ఇప్పటికే ఈ బంద్‌ను బలపరిచాయి. వామపక్ష పార్టీలు ఈ బంద్‌కు మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొనాలని తమ కార్యకర్తలను ఆదేశించాయి. వై.యస్.ఆర్.కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన లాంటి ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి కృషి చేయాలి.
విశాఖ ఉక్కుపై ఎందుకింత ద్వేషం?
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. చివరికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఉక్కు పరిశ్రమ సాధించుకున్నారు. ఈ పరిశ్రమ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి రూ.5 వేల కోట్లు. కాని ఇప్పటికే ఈ పరిశ్రమ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.42 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.9 వేల కోట్లు... పన్నులు, డివిడెండ్ల రూపంలో అందింది. ప్రత్యక్షంగా 32 వేల మందికి, పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి కల్పించింది. ఈ పరిశ్రమకే గనుక సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించి ఉంటే వేల కోట్ల నికర లాభాలతో ఉండేది. జిందాల్, మిట్టల్, టాటా, వేదాంత, పోస్కో లాంటి ప్రైవేట్ కంపెనీలకు ఇనుప ఖనిజాన్ని కేటాయించి విశాఖ ఉక్కుకు నిరాకరించిన ఫలితంగా నష్టాలు కనపడుతున్నాయి. దీని బాధ్యత కేంద్రానిదే. ఈ కారణాన్ని చూపి ఈ పరిశ్రమను అమ్మేయడానికి బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. సుమారు రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఈ పరిశ్రమ, దానికి అనుబంధంగా ఉండే వేల ఎకరాల భూములను కేవలం రూ.13 వేల కోట్లకు పోస్కో కంపెనీకి ధారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీకి దేశ ప్రజల విలువైన ఆస్తులను కారుచౌకగా అమ్మేయడమే దేశభక్తా? ఏదేమైనా విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా కుహనా జాతీయవాదులకు, వారి అంధ భక్తులకు మనం తగిన సమాధానం చెప్పాలి.
వ్యవసాయ చట్టాలు ఎవరి కోసం?
కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు రైతాంగానికి, ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మార్కెట్లను అప్పగించడమే ఈ చట్టాల ధ్యేయం. క్రమబద్ధమైన మార్కెట్ యార్డులు లేకుండా చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను కారుచౌకగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ చట్టాల్లో మద్దతు ధర మాటే లేకుండటం బిజెపి ప్రభుత్వ రైతు వ్యతిరేక కుట్రకు నిదర్శనం. వ్యవసాయ ఉత్పత్తులను కారుచౌకగా కొనుగోలు చేసి గోదాముల్లో భారీగా నిల్వ చేసుకోవడానికి ఈ చట్టాలు కంపెనీలకు హక్కునిస్తున్నాయి. దీని వలన నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై భారాలు పడతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ధరలు ఎంత పెరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు, విజిలెన్స్ శాఖ, పోలీసులు గోదాముల జోలికి పోరాదని ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. తద్వారా సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచి విపరీతంగా లాభాల పంట పండించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఏర్పడుతోంది. కాంట్రాక్ట్ వ్యవసాయం పేరిట కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు తమ సొంత పొలాల్లో పాలేర్లుగా పనిచేసే విధానాన్ని ఈ చట్టాలు సృష్టిస్తాయి. అందుకే రైతాంగం, వ్యవసాయ నిపుణులు, అభ్యుదయ మేధావులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. అయితే కార్పొరేట్లకు ఊడిగం చేయడమే లక్ష్యంగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, బిజెపి పాలకులు... ప్రజల నుంచి వెలువడుతున్న వ్యతిరేకతను ఏమాత్రం లెక్కచేయడంలేదు. తమ దుర్మార్గపు విధానాలను బలవంతంగా దేశంపై రద్దుతున్నారు.
కార్మికులపై మోడీ ప్రభుత్వ ఏకపక్షం యుద్ధం..
కార్పొరేట్ల సేవలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల కార్మిక సంస్కరణలను మరింత వేగంగా అమలు చేస్తున్నది. బ్రిటీష్ కాలం నుండి దేశంలోని కార్మికవర్గం అనేక పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా తన మంద బలంతో ఆమోదింపచేసింది. పాత కార్మిక చట్టాల్లో కార్మికులకు ఉండే అంతో ఇంతో ప్రయోజనాన్ని కూడా ప్రస్తుత లేబర్ కోడ్లలో తొలగించేసింది. కార్మిక శాఖకు ఎగ్జిక్యూటివ్ అధికారాలను తొలగించింది. కోరల్లేని తాచు లాంటి లేబర్ కోడ్లు అలంకార ప్రాయమే తప్ప ప్రయోజనం శూన్యం. పైగా పారిశ్రామిక యాజమాన్యాలు చిరకాలంగా కోరుతున్న ''హైర్ అండ్ ఫైర్'' విధానాన్ని వీటి ద్వారా అమల్లోకి వచ్చింది. కార్మికులు, ఉద్యోగులు ఎప్పటికీ పర్మినెంట్ కాని పద్ధతిలో 'ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్' అమల్లోకి వచ్చింది. పారిశ్రామిక ప్రమాదాల్లో కూడా యజమానులకు బాధ్యత లేకుండా కోడ్‌లు రూపొందించింది. దేశంలోని కోట్లాది కార్మికులు ఈ లేబర్ కోడ్ల వల్ల ఆధునిక బానిసలుగా మార్చబడ్డారు. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ వేతనాలతో అత్యధిక గంటలు పని చేస్తున్నది భారతదేశంలోనేనని ఐఎల్‌ఓ (అంతర్జాతీయ కార్మిక సంస్థ) తాజా అధ్యయనం నిర్ధారించింది.
దేశాన్ని కారుచౌకగా కట్టబెట్టడానికే..
దేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియను మోడీ ప్రభుత్వం వేగవంతం చేసింది. రైల్వేలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ పరిశ్రమలు, గనులు, ఖనిజ వనరులు సర్వస్వాన్ని ప్రైవేటుపరం చేయడమే విధానంగా నరేంద్ర మోడీ 'ఆత్మనిర్భర్ భారత్' పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశ సంపదను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించడమే ఈ ఆత్మనిర్భరతలో ఉన్న అసలు కిటుకు. గతంలో 'స్వదేశీ జాగరణ మంచ్' పేరుతో బిజెపి కార్యకర్తలు నానా యాగీ చేశారు. ప్రస్తుత ప్రైవేటీకరణ పట్ల వారి నోళ్ళు పడిపోయాయి. అధికారం వచ్చే వరకు ఒక మాట, అధికారం వచ్చిన వెంటనే దానికి భిన్నమైన మాట వీరి విధానం. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా అన్ని పరిశ్రమలను అమ్మివేయడమే తమ విధానంగా బిజెపి మంత్రులు పదే పదే ప్రకటించడాన్ని బట్టి...దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించడానికి వీరు ఎంతగా తహతహలాడుతున్నారో అర్థమవుతోంది. స్వదేశీ పెట్టుబడిదారులే కాదు. విదేశీ పెట్టుబడిదారులకు కూడా ఎర్ర తివాచీ పరచి స్వాగతం చెప్పడం బిజెపి ప్రభుత్వం ప్రత్యేకత. బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మొదలుకొని ప్రకృతి వనరుల వరకు ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకోండని స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ముందు సాగిలపడే ప్రభుత్వాన్ని మోడీ హయాంలో చూస్తున్నాము. దేశంలోని నౌకాశ్రయాలు, అనేక విమానాశ్రయాలు ఇప్పటికే తమ సన్నిహితుడు గౌతమ్ అదానికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. భారీగా పన్ను రాయితీలిచ్చినా బ్యాంకులకు కట్టాల్సిన వాయిదా సొమ్మును కూడా ఎగ్గొడుతున్న కార్పొరేట్లు బిజెపి కి అత్యంత సన్నిహితులు. ఇది ఆత్మనిర్భరత కాదు. విధ్వంసమే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఇన్నాళ్లు పనిచేసిన ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, పరిశ్రమలను ధ్వంసం చేయడం స్వదేశీ, విదేశీ ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పడం దేశభక్తులు చేయకూడని దుర్మార్గం.
మోడీ గత విధానాలు దేశానికి మేలు చేశాయా?
1) మోడీ ప్రభుత్వం 2018లో చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రజల పాలిట శాపంగా మారి తమ డబ్బును పొందేందుకు క్యూలో నిలబడి 120 మంది ప్రజలు చనిపోయారు. వంద రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయని ఆ రకంగా రాకపోతే తనను బహిరంగంగా ఉరితీయమని మోడీగారే సెలవిచ్చారు. ఏం జరిగింది? నోట్ల రద్దు వల్ల కొత్తగా నల్లధనమేమీ బయటకు రాలేదని, రద్దయిన నోట్ల కంటే అధికంగా నోట్లు వాపసు వచ్చాయని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి మోడీ విధానం ఎవరికి మేలు చేసింది. 2) ఒకే దేశం ఒకే పన్ను పేరిట జిఎస్‌టి పన్నును బలవంతంగా బిజెపి ప్రభుత్వం అమలు చేసింది. జిఎస్‌టి లో ఉన్న షరతులను అమలు జరపలేని అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీని వల్ల సుమారు 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ పన్ను వల్ల ప్రజలపై భారాలు పెరగడం, రాష్ట్రాలు తమ ఆదాయాలను కోల్పోవడం తప్ప ప్రజలకు జరిగిన ప్రయోజనం శూన్యం. 3) మేక్ ఇన్ ఇండియా పేరుతో మోడీ ప్రారంభించిన విధానం 'ఫ్లాప్ ఇన్ ఇండియా'గా మారింది. భారీ సంఖ్యలో పరిశ్రమలు వస్తాయని, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామని మోడీగారు ప్రజలను భ్రమ పెట్టారు. ఆచరణలో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మూతబడి అనేక మంది కొత్తగా నిరుద్యోగ సైన్యంలో చేరారు. ఎన్నికల్లో ఒక్కసారి గెలిపిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల నల్ల ధనాన్ని తెచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ఒక్క రూపాయి తేలేకపోయారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటడమే మోడీ గొప్పతనం. కొత్త ఉద్యోగాలు రాకపోగా దేశంలో నానాటికి నిరుద్యోగం పెరుగుతూ ఉంటే ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఈ బధిరాంధ ప్రభుత్వ ఘనత. దేశంలోని సాధారణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే పన్ను రాయితీల ద్వారా, బ్యాంకుల ద్వారా రూ.లక్షల కోట్లు అప్పనంగా అందిస్తున్న మోడీ అండ్‌కో కు ప్రజలు బుద్ధి చెప్పాలి. అందులో భాగంగానే ప్రజానీకం స్వచ్ఛందంగా పెద్దఎత్తున కదిలివచ్చి మార్చి 26 బంద్‌ను విజయవంతం చేయాలి.
* ఎం.ఏ.గఫూర్ /వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి/










