Jul 22,2021 19:12

న్యూఢిల్లీ : తమపై కూడా కేంద్రం నిఘా పెట్టిందని భావిస్తున్నట్లు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న రైతు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అనైతిక ప్రభుత్వమని, నిఘా పెట్టిన జాబితాలో తాము కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని రైతు నేత శివకుమార్‌ కక్కా అన్నారు. ఈ నిఘా వెనుక మోడీ సర్కార్‌ ఉందని, అందుకే తమ సమస్య సాగుతోందని స్పష్టమౌందని అన్నారు. మాపైన కూడా ఓ కన్నేసి ఉంచినట్లు అర్థమౌతోందని వ్యాఖ్యానించారు. 2020-2021 సంవత్సరం నాటి డేటాలో రైతు నేతల ఫోన్‌ నంబర్లు కూడా ఉండవచ్చునని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. ఒకసారి ఈ డేటా బహిర్గతమైతే...మా నంబర్లు కూడా అందులో ఉండే అవకాశాలున్నాయని విమర్శించారు. తమ సమస్యను బ్రిటన్‌ పార్లమెంట్‌లో చర్చించారు కానీ...ఇక్కడి పార్లమెంట్‌లో చర్చించలేదని యాదవ్‌ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల లేవనెత్తిన అంశాలపై చర్చ నిర్వహించాలని చెప్పారు. తమ డిమాండ్లను లేవనెత్తాలని ఎంపిలందరికీ లేఖ రాశామని, కానీ పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ సాగించడం లేదని మరో యూనియన్‌ నేత హన్నన్‌ మొల్లా విమర్శించారు. తామేమీ ఫూల్స్‌ కాదని కేంద్రానికి నిరూపితం చేసేందుకు రైతులు జంతర్‌ మంతర్‌ వద్దకు వచ్చారని అన్నారు. కిసాన్‌ సంసద్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మందితో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు చేపడుతున్న సంగతి విదితమే.