Feb 12,2023 23:58

ఆందోళన చేస్తున్న నేవీ నిర్వాసితులు

ప్రజాశక్తి-రాంబిల్లి
'దేశ రక్షణ కోసం నేవీకి మా భూములు ఇచ్చాం. కాని మా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాపై దయ లేదా?' అని ఎన్‌ఎఒబి నిర్వాసితులు ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద నేవీ ప్రధాన గేట్‌ ముందు ఎనిమిది గ్రామాల నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఆదివారం నాటికి 105వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ శారదా, వరహ నదుల గుండా వెళ్లి సముద్రంలో చేపల వేట సాగించి జీవనం సాగించేవాళ్లమని తెలిపారు. నేడు నేవీ అనుమతి నిరాకరించడంతో సముద్రంపై వేటకు వెళ్లే పరిస్థితి లేక ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎఒబికి భూములిచ్చిన సమయంలోనూ, తరువాత ప్రభుత్వం, నేవీతో చేసుకున్న ఒప్పందాలు నేటికీ అమలు కాకపోవడం అన్యాయమన్నారు. తమ సమస్యలపై 105 రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెండింగ్‌ ప్యాకేజీలు ఇవ్వాలని, జెట్టీ నిర్మాణం చేపట్టాలని, అంత వరకు నేవీ లోపల నుంచి చేపల వేటకు ఆధార్‌ ఆధారంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల నిర్వాసితులు, నేవీ నిర్వాసిత జెఎసి నాయకులు పాల్గొన్నారు.