ప్రజాశక్తి-కాకినాడ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులను ఆన్‌లైన్‌లో కాక మాన్యువల్‌గా చేపట్టాలని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో కో కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి.నాగమణి, బి.శరత్, వెంకట్ రాజు, ప్రభాకర్ వర్మ మాట్లాడారు. ఈ నెల 17న మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో అన్ని రకాల ఉపాధ్యాయ పదోన్నతులను మాన్యువల్‌గా జరపడానికి హామీ ఇచ్చారని, కానీ భిన్నంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు మాన్యువల్‌గా కాక ఆన్‌లైన్‌లో జరపడానికి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఖాళీలు ఎక్కడ ఉన్నాయో చూపకుండా ప్రమోషన్లు వద్దనుకునేవారు రాతపూర్వకంగా అన్‌విల్లింగ్ తెలపాలని ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విధానానికి ఈ ప్రక్రియకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. 2022 జూలైలో ఒకసారి 2023 జనవరిలో మరోసారి ప్రమోషన్లు ఇస్తామని ఉపాధ్యాయుల నుండి విల్లింగ్ తీసుకున్నారన్నారు. ప్రమోషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అది తేలిన తర్వాతే ప్రమోషన్లు ఖరారు చేస్తామని నమ్మించి రూ.2500 అలవెన్స్‌తో నాలుగు నెలలు పని చేయించుకున్నట్టు తెలిపారు. కానీ మొత్తం ప్రమోషన్ కౌన్సిలింగ్ రద్దుచేసి అందరికీ నిరాశ కలిగించారన్నారు. ఇప్పుడు ఎటువంటి ఖాళీలు చూపకుండా విల్లింగ్ ఇచ్చిన వారికే ప్రమోషన్లు కల్పిస్తామని అధికారులు చెపుతున్నారన్నారు. ఎంఇఒ-2 ప్రమోషన్ల షెడ్యూల్‌ను కూడా ఇంతవరకు ప్రకటించలేదన్నారు. అధికారుల తీరు ద్వారా అనేకమంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిఇఒక వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె.కాశీవిశ్వనాథం, ఎం.శ్రీనివాస్, సిహెచ్.రవి, కె.రామచంద్రరావు, ఎన్.గోవిందరాజులు, భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










