Jul 04,2021 06:58

మానవ సమాజంలో ఇంతవరకు దోపిడీ వర్గాలు అనుసరిస్తూ వచ్చిన నీతి... స్వార్థపరత్వం, కాపట్యం, వంచన, క్రౌర్యం వగైరా. కానీ, కార్మికులు, కష్టజీవుల నైతిక లక్షణాలు మానవత, సమిష్టితత్వం, అన్యోన్య సహాయం వగైరా. ఒకటి కార్పొరేట్లకు దోచిపెట్టే నయా ఉదారవాదం నీతి... మరొకటి శ్రామిక ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణమైన నీతి. ఈ రెండింటి మధ్య తేడాను కరోనా కష్టకాలం కళ్లకు కట్టినట్లు చూపింది. సాటి మానవుల కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఆస్తులను రెండు రెట్లు పెంచుకున్న సంపన్న వర్గం ఒకవైపు... ఉపాధి కూడా కోల్పోయి మరింత పేదరికంలోకి దిగజారిపోతున్నా... సాటి మానవులను ఆదుకోడానికి అపూర్వమైన రీతిలో స్పందించిన పేద ప్రజలు మరొకవైపు మనకీ కరోనా కాలంలో దర్శనమిస్తున్నారు. వృద్ధాప్యంలో అక్కరకొస్తుందని జీవితకాలమంతా కూడబెట్టిన సొమ్మును వ్యాక్సిన్‌ కొనుగోలుకు విరాళంగా ఇచ్చాడొక కార్మికుడు. తనకు జీవనాధారంగా వున్న నాలుగు గొర్రెలనూ అమ్మి వ్యాక్సిన్‌లను కొని ప్రజలను కాపాడమని కోరింది ఒక నిరుపేద మహిళ. ఇలా దేశంలో ఎందరో చాలా గొప్పగా తమ మానవత్వాన్ని ప్రదర్శించారు. కానీ ఇదే కాలంలో ప్రజల సంపదను కొల్లగొట్టాలని కార్పొరేట్లు ప్రయత్నించారు. వ్యాక్సిన్‌ వ్యాపారం చేసి కోట్లు పోగేసుకొందామని కూడా తాపత్రయపడుతున్నారు.
     ఒక నిరుపేద తన ఇంట్లో వున్న ఐదారు కేజీల బియ్యంతో వలస కూలీల ఆకలి తీర్చాడు. ఆ మరుసటి రోజు తన కూలి డబ్బుతో వారి ఆకలి తీర్చాడు. ఆ తర్వాతి రోజూ అదే విధంగా చేశాడు. ఉదయం వలస కూలీల ఆకలి తీర్చడం... సాయంత్రం వరకు పని చేయడం, ఆ వచ్చిన కూలి డబ్బుతో మళ్లీ వలసకూలీల ఆకలి తీర్చడం. ఇది చూసిన కొందరు మేము సైతం తోడుంటాం అంటూ... అతనికి తోడు నిలిచారు. ఒక్కడుగా మొదలేసిన సాయం... పదుగురితో శిబిరంగా మారింది. మరింతమంది ఆకలి తీరింది. వారంతా కడుపు చేతపట్టుకొని తమ గమ్యాన్ని అడుగులతో కొలుస్తూ... వెళ్లేవారే. ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూనే వుంటారు. వసంతం తెచ్చిన పూల వాకిళ్లలా ఆ దారంతా గుప్పెడు అన్నం పెట్టేవారో, నాల్గు బిస్కెట్లు ఇచ్చేవారో... చల్లని మజ్జిగ తాపేవారో తారసపడుతూనే వుంటారు. ఎవరు ఎవరో తెలియకపోయినా... అన్నదాతా సుఖీభవ అన్నట్లుగా వారి కళ్లలో కృతజ్ఞతా భావం కదలాడుతుంది. మానవత్వం మీద మమకారం పెరుగుతుంది. మనిషి మీద నమ్మకం కలుగుతుంది. మనిషిమీద, మానవత్వంమీద నమ్మకం సన్నగిల్లిపోయే క్రమంలో... ఎడారిలో ఒయాసిసులా.. మానవత్వం మూర్తీభవించిన మనిషి కనబడితే... ఆదరించి ఆకలి తీర్చితే... అన్నార్తుల ఆవేదన చల్లారుతుంది. మానవత్వం ఇంకా బతికే వుందనే నమ్మకం వారిలో కలుగుతుంది.
      ఇంత కరోనా సమయంలోనూ అంబానీలు, అదానీల కార్పొరేట్‌ సహాయ నిధులు, ప్రభుత్వాల పథకాలు ఏవీ అక్కరకు రాలేదు. ఒక పేదవాడే సాటి పేదవాడ్ని అదుకొనే మంచి మనసును కనబరిచాడు. అంటరానితనం, కులం, మతం, భాష, ప్రాంతం... ఏదీ ఈ సహాయానికి అడ్డుకాలేదు. కష్టాల్లో వున్న మనిషిని ఆదుకోవాలనే ఒక మహోన్నత ఆశయం ఈ సమయంలో కనిపించింది. కార్పొరేట్ల మాదిరిగా డబ్బు లేకపోయినా... అప్పు చేసి ఇచ్చిన వారున్నారు. మెడలోని బంగారం తాకట్టు పెట్టి ఇచ్చినవారున్నారు. సాయం చేయాలన్న స్ఫూర్తికి పేదరికం అడ్డుకాలేదు.
     పెట్టుబడిదారుడు తన లాభాలను మాత్రమే చూసుకుంటున్నాడు. కార్పొరేట్లను ఎలా కాపాడాలి, వారికెలా మేలు చేయాలన్న తాపత్రయంలోనే ప్రభుత్వాలున్నాయి. ప్రజలను నిర్లక్ష్యానికి వదిలేసారు. కానీ... కష్టజీవులు వదిలేయలేదు. మానవత్వం చచ్చిపోలేదని నిరూపించారు. ఈ మానవత్వమే.... మానవజాతికి, మానవ సమాజానికి దిక్సూచిలా దారిచూపుతుంది. స్వార్థం, దోపిడీలు మానవత్వం ముందు తలవంచక తప్పదు. 'నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా' అని మహాకవికి సందేహం కలిగింది. కానీ, భవిష్యత్‌ మానవత్వానిదేనని వీరంతా నిరూపించారు. మానవత్వం.... సమాజం మీద, మనుషుల మీద నమ్మకాన్ని బతికించింది. స్వతహాగా మనిషిలో వుండే సహజ లక్షణం అది. 'సోషలిజం కోసం నాటిన విత్తనాల్లాంటివాళ్లం మేము. ఓ వసంత సుప్రభాతాన ప్రపంచ వ్యాపితంగా మొలకెత్తుతాం' అంటాడు జూలియస్‌ ఫ్యూజిక్‌. ఈ మానవత్వమే ఓ సుప్రభాతాన సమసమాజానికి బాటలు వేస్తుంది. మానవత్వమే సమాజాన్ని నడిపిస్తుందని కమ్యూనిజం చెప్పే మాట నిజమౌతుంది.