ప్రజాశక్తి-బాపట్ల: రక్తదానం మానవత్వానికి నిదర్శనమని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం బాపట్ల వ్యవసాయ కళాశాలలోని బివి నాథ్ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ సేవా పథకంలో భాగంగా బాపట్ల, రేపల్లె రెడ్‌క్రాస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో రక్తదానం అత్యున్నతమైంది. ఆపత్కాలంలో సాటి మనిషికి రక్తాన్ని దానం చేయడం ద్వారా నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం ఒక సేవా భావంగా ప్రతి విద్యార్థి బాధ్యతగా భావించాలన్నారు. బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు రక్తదాన ఆవశ్యకతను విద్యార్థులకు వివరణాత్మకంగా తెలియజేశారు. కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 165 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల రక్త నమూనాలను పరీక్షించి 65 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్లు ఎం శ్రీనివాసరావు, ఎం సునీల్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్లు వి ప్రసన్న కుమారి, వి జ్యోతి, ఐ ఉషారాణి, ఆర్ బాల మురళీధర్ నాయక్, ఎం రవిబాబు, బి విజయాభినందన, కె హేమ, డాక్టర్ ఎం రమాదేవి, కళాశాల వైద్యురాలు కె జ్యోతి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.










