ప్రజాశక్తి-తెనాలి : మనుషుల మధ్య ప్రేమ, ఐక్యతకు 'రెండు ఆకాశాల మద్య' నవల అద్దం పట్టిందని ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత సయ్యద్ సలీం రచించిన 'రెండు ఆకాశాల మధ్య' నవల పరిచయం, ఆవిష్కరణ సభను స్థానిక కొత్తపేటలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. పట్టణానికి చెందిన శారద సాహితి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షత వహించి మాట్లాడుతూ సయ్యద్ సలీం రచనాశైలి, నవలలో ప్రతిబింబించిన మానవత్వపు విలువలు హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచాయన్నారు. రచయిత సలీం మాట్లాడుతూ దేశ విభజన సమయంలో సరిహద్దులోని ఇరు దేశాలకు చెందిన రెండు గ్రామాలను కథాంశంగా తీసుకుని, మతం కంటే మానవత్వం గొప్పదన్న భావంతో నవలా రచన సాగించామన్నారు. రచయిత పరిచయాన్ని, నవలపై విశ్లేషణను ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని చేశారు. ఈ సందర్భంగా సలీంను సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వై.హనుమంతరావు, కోశాధికారి పి.నాగేంద్రం, ఎన్.వెంకటేశ్వరరావు, బి.కృష్ణ, జి.మురళీకృష్ణ, వి.భీమేశ్వరప్రసాద్ పాల్గొన్నారు.










