Dec 19,2021 11:40

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 25ను క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్‌ పేరుతో వేడుక జరుపుకోవడం మనకు తెలుసు. క్రీస్తు జననానికి సంబంధించిన ఘట్టాలను ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, కథలు వినడం పిల్లలకే కాదు పెద్దలకూ ఓ ఆనందకర సమయం. మతపరమైన విశిష్టత కాసేపు పక్కన పెడితే క్రిస్మస్‌ అంటే ఇవ్వడం. కుటుంబ, బంధుమిత్రుల కలయిక, అందమైన అలంకరణలు, ఆహ్లాదమైన సంగీతం, ఆనందమైన ఆహారం. ఈ క్రమంలో ఇంటి ముందు కాంతులీనే నక్షత్రం, ఇంటి లోపల అలంకరించిన క్రిస్మస్‌ చెట్టు, ఘుమఘుమలాడే క్రిస్మస్‌ కేక్‌ మామూలే. ఈ మధ్యలో 'శాంటా క్లాజ్‌' అనే ఒకే క్రిస్మస్‌ తాత. దుప్పుల సారథ్యంలో సాగే మంచు రథం ఎక్కి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ, ఇళ్ల పొగ గొట్టాల గుండా లోపలికి జారి, అక్కడి క్రిస్మస్‌ చెట్టుకి వేలాడదీసిన సాక్స్‌ (మేజోళ్ల) లో కోరుకున్న బహుమతులు పెట్టి వెళ్లిపోతాడని ఒకప్పటి నమ్మకం. ఎరుపు దుస్తులు వేసుకుని తెల్లగడ్డం పెట్టుకున్న శాంటాక్లాజ్‌లు ఇప్పుడు షాపింగ్‌ మాల్స్‌ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్స్‌, బెలూన్స్‌ ఇస్తూ సంతోషపరుస్తుంటారు. మనదేశంలోనూ ఇప్పుడు చాలాచోట్ల ఇలానే శాంటాక్లాజ్‌లు దర్శనమిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం..!

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!


    క్రిస్మస్‌ పండుగలో భాగంగా రెండు వారాలా ముందు నుండే బృందాలుగా ఇంటింటికీ వెళ్లి పాటలు (కేరల్స్‌) పాడటమూ ఒక సందడే. విశేషమేమంటే, ఈ పండుగకు 'మా ఇంటికి రండి' అని పిలవనక్కరలేదు. క్రైస్తవులు తమ మిత్రుల ఇళ్లకు వెళ్లి, కేక్‌ ఇచ్చి, వారు ఇచ్చిన కేక్‌ తిని, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలిపి రావడం.. ఒక అందమైన ఆత్మీయ అనుబంధ వ్యక్తీకరణ. అందరినీ ప్రేమించడం, అందరితోనూ ఆనందంగా ఉండటం వేడుకల్లో కనిపిస్తుంది. అమెరికాలో అయితే నవంబర్‌ మూడో గురువారం ప్రాంతంలో వచ్చే కృతజ్ఞతా దినం (థ్యాంక్స్‌ గివింగ్‌ డే) తరువాత మొదలయ్యే క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా కొత్త సంవత్సరం వరకూ కొనసాగుతాయి.

                                                      మంచి అలవాటు కోసం...

ఫాన్స్‌లో క్రిస్మస్‌ వేడుకలు సెయింట్‌ నికోలస్‌ దినంగా భావించే డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభమవుతాయి. మొత్తం నగరాలన్నీ శోభాయమానంగా దీపాలతో అలంకరిస్తారు. పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందిస్తారు. పిల్లలు తమ బూట్లను పాలిష్‌ చేసి మరీ తమ ఇంట్లోని దీపాల దగ్గర ఉంచుతారు. ఇలాగైనా శుచీ శుభ్రత పిల్లలకు ముందు నుంచే అలవాటు అవుతాయనేమో. పిల్లల సరదా మాత్రం వేరు.. క్రిస్మస్‌ తాత వాటి నిండా చాకెట్లు నింపుతాడని వారి నమ్మకం. క్రిస్మస్‌ రోజు కుటుంబాలన్నీ ఒకచోట చేరి, విందు చేసుకుంటాయి.. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాయి.

                                                       పిల్లల్ని సరిజేసేందుకు..

ఇటలీలో శాంటాక్లాజ్‌ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచిపెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందనీ.. చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందనీ నమ్మకం. చిన్నారుల్ని సరిజేసేందుకు ఇదో మంచి సందర్భం. మరో మాట.. ఈ సంబరమంతా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది.

                                             ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఆనందం...

నెదర్లాండ్స్‌లో శాంటాక్లాజ్‌ని 'సిన్తర్‌ క్లాజ్‌' అంటారు. అతను వారికి ఎక్కడో ఉత్తరధృవంపై కాక స్పెయిన్‌లో నివసిస్తాడనీ, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్‌ పీటర్‌ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడనీ ప్రజలు భావిస్తారు. వారి సంస్కృతిలోని కొన్ని లోపాలు, చారిత్రకంగా అందివచ్చిన భావజాలాల వల్ల బ్లాక్‌ పీటర్‌ బానిసపాత్ర వచ్చినా ప్రస్తుతం మాత్రం క్రిస్మస్‌ వేడుకల్లో అంతా సంతోషమే కనిపిస్తోంది. తమకు గిఫ్ట్‌లిచ్చే పాత్రల పుట్టుపూర్వోత్తరాల కన్నా ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందాన్నే ఎక్కువ వెతుక్కుంటున్నారు.

                                                       ప్రత్యేక పానీయంతో...

జర్మనీలో కూడా క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఎక్కడబడితే అక్కడ ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తారు. వాటిలో క్రిస్మస్‌కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా గ్లూవైన్‌ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచుపట్టి వున్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్మస్‌ రోజుల్లో మాత్రమే తయారుచేస్తారు.

                                                        నెలరోజుల పాటు..

లండన్‌లో క్రిస్మస్‌కి నెలరోజుల ముందే వేడుకలు మొదలవుతాయి. జనవరి మొదటి తేదీ వరకూ కొనసాగుతాయి. ఆ రోజుల్లో నగరమంతా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. త్వరగా చీకటి పడటంతో వేడుకలు తెల్లవారుఝాము వరకూ జరుగుతాయి. దాదాపు ప్రతి కూడలిలోనూ క్రిస్మస్‌ చెట్లు ఆకర్షణీయమైన అలంకరణలతో వెలుగొందుతాయి.

                                                        విస్తరించిందిలా...

ఇప్పుడు ప్రతిచోటా కృత్రిమంగా ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం మామూలైపోయింది. ఇలా క్రిస్మస్‌కి ఒక చెట్టుని అలంకరించడం 16వ శతాబ్దంలోనే జర్మనీలో ప్రారంభమైంది. ఫర్‌ చెట్టుకి యాపిల్‌ పండ్లు, కొవ్వొత్తులు, రంగు కాగితాలు అలంకరించేవాళ్లు. ఈ సాంప్రదాయాన్ని విక్టోరియా రాణి భర్త, ఆల్బర్ట్‌ తన స్వస్థలం జర్మనీ నుంచి ఇంగ్లాండ్‌కి తీసుకువచ్చాడు. 19వ శతాబ్దపు చివరలో ఈ చెట్టు సాంప్రదాయం అమెరికాకి చేరింది. మనదేశంలో కూడా చెట్టుని అలంకరిస్తారు.

                                                           క్రిస్మస్‌ కారల్స్‌..

ఏ పండుగైనా.. ఎవరి పండుగైనా పాటలు తప్పనిసరి. క్రిస్మస్‌ అందుకు భిన్నం కాదు. ఆ సమయంలో పాటలు పాడుకోవడం క్రీస్తు పుట్టక ముందే ప్రారంభమైంది. కొన్నివేల సంవత్సరాల క్రితమే యూరప్‌లో శీతాకాలంలో డిసెంబర్‌ 22 ప్రాంతంలో రైతులందరూ ఒకచోట చేరి గుండ్రంగా తిరుగుతూ పాడుకునేవారు. కారల్‌ అంటేనే నాట్యం చేస్తూ పాడుకునేది అని అర్థం.
    క్రీస్తు శకం 129లో మొట్టమొదటి కారల్‌, 'ఏంజెల్‌ మిమ్‌'ని ఒక రోమన్‌ బిషప్‌ క్రిస్మస్‌ రోజున పాడాలని ఆదేశించాడు. 'హార్క్‌! ది హేరాల్డ్స్‌ ఏంజెల్స్‌ సింగ్‌' అనే పాట 1739 కంటే ముందు రాసిందని అంటారు. బాగా ప్రాచుర్యం పొందిన 'సైలెంట్‌ నైట్‌' పాటని జోసెఫ్‌ మోర్‌ అనే జర్మన్‌ రాస్తే, జేవియర్‌ గురూబర్గ్‌ సంగీతం సమకూర్చాడు. దాన్ని డిసెంబర్‌ 24, 1818న ఆస్ట్రియాలో మొదటిసారి ఆలపించారు. ఇప్పటికీ ఆ పాట 44 భాషల్లో అనువాదం అయ్యింది. ప్రస్తుతం పాడుతున్న కారల్స్‌ చాలా వరకూ 1843-1883 మధ్య ప్రాంతంలో రాసినవి.

                                                           శాంటా క్లాజ్‌

క్రిస్మస్‌తో ముడిపడి వున్న మరో అంశం శాంటా క్లాజ్‌. ఎరుపు, తెలుపు దుస్తులతో, పొడవాటి తెల్లని గడ్డం, తలపై ఎర్ర టోపీ, భుజాన పెద్ద సంచి, అందులో అనేక బహుమతులు.. ఈ ఆహార్యంతో ఉండే శాంటా క్లాజ్‌గా ఇప్పుడు మన దేశంలోనూ క్రిస్మస్‌ సమయంలో చాలా మంది కనిపిస్తుంటారు. క్రిస్మస్‌ తాతగా ప్రసిద్ధి చెందిన శాంటా క్లాజ్‌ రూపురేఖలు, హావభావాలు క్లెమెంట్‌ మూర్‌ అనే కవివి 1823లో రాసిన పద్యం 'ఎ విజిట్‌ ఫ్రం శాంటా క్లాజ్‌'లో వివరించాడు. 'లావుగా, బొద్దుగా, ఆనందంగా వుండి, ఎగిరే అడవి దుప్పులు లాగే వాహనంపై తిరుగుతూ, ఇళ్ల పొగ గొట్టాల గుండా దిగి, పిల్లలు వేలాడదీసిన సాక్సుల్లో బహుమతులు పెట్టి వెళ్లిపోతాడు'.

                                               క్రిస్మస్‌ పేరు ముందు నుండీ ఉందా ?

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!

కిస్మస్‌ అనే మాట క్రీస్తు-మాస్‌ అనే ఒక ఆచారం నుండి వచ్చింది. ఏసు తమ కోసం మరణించి, పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్షా రసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం (కమ్మ్యూనియన్‌) అనే పేరుతో నిర్వహిస్తారు. సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునేవాళ్లు. క్రీస్తు..మాస్‌ క్రమంగా క్రిస్మస్‌గా మారింది.

                                                క్రిస్మస్‌ అనాలా, ఎక్స్‌ మస్‌ అనాలా ?

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!

క్రిస్టియానిటీ అనే పదాన్ని 1100వ సంవత్సర ప్రాంతంలో క్సియానిటీ అని పలికేవారు. ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్‌తో మొదలవుతుంది. గ్రీక్‌ భాషలో ఎక్స్‌ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు. దాంతో గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్‌తో ఉండేది. 1551లో క్రిస్మస్‌ని ఎక్స్‌ టేమాస్‌ అనేవారు. క్రమేపీ అదే ఎక్స్‌మస్‌గా రూపాంతరం చెందింది.

                                                     డిసెంబర్‌ 25 నే ఎందుకు ?

వాస్తవానికి డిసెంబర్‌ 25నే ఏసుక్రీస్తు జన్మించాడు అనటానికి చారిత్రక ఆధారాలు లేవంటారు. ఆ మాటకొస్తే అసలు ఆ రోజునే ఏసు జన్మించాడని ఎవరికీ తెలీదు. బైబిల్‌లో కూడా ఆ తేదీ ప్రస్తావన లేదు. బహుశ క్రీస్తు పుట్టుక క్రీస్తు శకం ఒకటో సంవత్సరంలో కాక కాస్త ముందుగానే అంటే క్రీస్తు పూర్వం 2-7వ సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చని కొందరి అంచనా. మన కాలమానంలో క్రీస్తు శకం '0' సంవత్సరం లేదు, నేరుగా క్రీ.పూ. 1 నుండి క్రీ.శ.1కి వెళ్తుంది.
      మొట్టమొదటి క్రిస్మస్‌ క్రీ.శ. 336వ సంవత్సరంలో, మొట్టమొదటి క్రైస్తవ రోమన్‌ చక్రవర్తి కాన్‌స్టాంటిన్‌ అధ్వర్యంలో జరిగింది అనడానికి నిదర్శనాలు ఉన్నాయి. కొన్నేళ్ల తరువాత, క్రీ.శ. 350లో మొదటి పోప్‌ జూలియస్‌ అప్పటి రోమ్‌ బిషప్‌గా ఉండేవాడు. డిసెంబర్‌ 25న జరుపుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది ఆయనే.
    అసలు క్రీస్తు పుట్టిన రెండు వందల ఏళ్ల తరువాతే మొట్టమొదటి సారి డిసెంబర్‌ 25 ప్రస్తావన కనిపిస్తుంది. అదీ, అప్పటి రోమన్ల 'సాటర్నేలియా' అనే ఒక కోత పండుగకు దీటుగా తొలి క్రిస్మస్‌ పండుగ జరుపుకున్నారని చెబుతారు. క్రైస్తవం రోమా సామ్రాజ్యంలో అధికారిక జాతీయ మతంగా ఎదిగిన తరువాత, క్రీస్తు శకం 529 ప్రాంతంలో, జస్టినియన్‌ చక్రవర్తి క్రిస్మస్‌ని సెలవు దినంగా ప్రకటించాడని ఒక వివరణ ఉంది. మన దక్షిణ భారతంలో పంట కోతకు వచ్చిన సమయంలో పండుగ చేసుకునే సాంప్రదాయం వంటిదే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటువంటి ఒక సంతోషకరమైన సందర్భమే క్రిస్మస్‌కి మూలం అంటారు కొందరు. యూదులకు హనుక్కా అనే పండుగ డిసెంబర్‌ 25వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. క్రీస్తు కూడా యూదుడే. అందువల్ల కూడా డిసెంబర్‌ 25ని ఎంచుకుని ఉండవచ్చు.
అయితే ఈ సంక్లిష్ట మూలాల జోలికి పోకుండా వుంటే, క్రిస్మస్‌ అనగానే ఒక ప్రపంచవ్యాప్త వేడుక అనిపిస్తుంది.

                                                  మనదేశంలో న్యూ ఇయర్‌ వరకూ...

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!

మనదేశంలోనూ తాహతు మేరకు క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు అధికం. అందుకే అక్కడ ఈ పండుగ హడావుడి ఎక్కువ. చర్చిలకు, ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, దీపాలతో అలంకరించడం ఇక్కడి అలవాటు. చర్చిలలో పండుగకు కొద్దిరోజుల ముందు నుండే 'ఆడ్వెంట్‌ సీజన్‌' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్మస్‌కి సరిగ్గా నెల ముందు 'సపోస్ట్‌ క్రిస్మస్‌' లేదా 'సెమీ క్రిస్మస్‌' పేరుతో ముందస్తు వేడుకలు జరుపుతారు. క్రీస్తు జననం ఇతివృత్తంగా నాటికలు, పాటలతో కోలాహలం ఉంటుంది. ఆ తరువాత చర్చి సభ్యులు బృందాలుగా విడిపోయి, ఒక్కో ప్రాంతంలోని కుటుంబాల ఇళ్లకు వెళ్లి క్రిస్మస్‌ పాటలు (కారల్స్‌) పాడతారు.
      కొన్ని చర్చిలలో క్రిస్మస్‌ ఈవ్‌ (క్రిస్మస్‌ ముందురోజు సాయంత్రం) ప్రత్యేక వేడుకలు ఉంటాయి. కొన్నిచోట్ల రాత్రి ప్రార్థనలు ఉంటాయి. యథావిధిగా క్రిస్మస్‌ రోజు ప్రార్థనలూ ఉంటాయి. క్రైస్తవేతరులు తమ క్రైస్తవ స్నేహితుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని అభినందించడం విశేషం. ఇతర పండుగలలాగే కొత్త బట్టలు వగైరా మామూలే. చాలామంది ఇళ్లకు స్టార్‌ లైట్లను అలంకరిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్‌ చెట్టు కూడా అలంకరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో స్థానికంగా లభించే అరటి, మామిడి చెట్లను అలంకరిస్తారు. కొందరు విద్యుత్‌ దీపాలు పెడితే కొంతమంది దీపావళి ప్రమిదలతో అలంకరించుకుంటారు. ఈ అలంకరణలు కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఉంచుతారు.
     దేవాలయాలకి వెళ్లడం, కొత్త దుస్తులు ధరించడం.. బంధువులు, స్నేహితులు వచ్చి శుభాకాంక్షలు తెలపడం, కేక్‌, ఇతర పిండి వంటలు ఇరుగుపొరుగు వారికి పంచడం.. ఇటువంటి సంబరాలతో క్రిస్మస్‌ రోజు కోలాహలంగా ఉంటుంది. ఇక అన్ని పండుగల్లాగే, క్రిస్మస్‌ రోజు రాత్రి స్నేహితులతో, చుట్టాలతో విందు భోజనం సాధారణంగా జరుగుతుంది. మొత్తానికి నెలపాటు క్రైస్తవులకూ, క్రైస్తవేతరులకూ క్రిస్మస్‌ సందడి ఉంటుంది.


                                                                పారడైజ్‌ చెట్టు...

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!

క్రీస్తు జననానికి ముందు నుండే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. క్రిస్మస్‌ సమయంలో క్రిస్మస్‌ చెట్టుని అందంగా అలంకరించి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత, నిత్యం పచ్చగా ఉండే ఫైన్‌ చెట్లను మాత్రమే అలంకరించేవాళ్లు. యూరప్‌ ప్రాచీన ఈజిప్టులు (ఐగుప్తులు), చైనీయులు, హేబ్రీయిలు పచ్చని చెట్లను అలంకరించి, వాటిని పూజించే వాళ్లు. దుష్టశక్తులను నిరోధించే శక్తి పచ్చని చెట్లకు ఉందని వాళ్ల విశ్వాసం. వాళ్ళు క్రైస్తవులుగా మారిన తరువాత కూడా క్రిస్మస్‌ పండుగ సంబరాల్లో అదే అలవాటుని కొనసాగించారు.
     అసలు క్రిస్మస్‌ ట్రీ ఇంట్లో పెట్టుకోవడం అనేది జర్మన్‌లో ప్రారంభమైంది. మధ్యయుగంలో జర్మన్‌లు డిసెంబర్‌ 24న ఈడెన్‌ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్‌ చెట్టుకి ఆపిల్‌ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వాళ్లు పారడైజ్‌ చెట్టుగా పిలుచుకునేవాళ్లు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్‌ చెట్టు ఆచారం బ్రిటన్‌లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ఆరంభమయ్యింది. అయితే జార్జియాలో చిచిలాకీ అనే చెట్టుని రూపొందిస్తారు. చెట్ల కొమ్మలను చెక్కి ఆ వచ్చిన చెక్కపొట్టుతో ఒక ఫర్‌ చెట్టులాగా తయారుచేస్తారు. విశేషం ఏమిటంటే, జార్జియన్‌లు క్రిస్మస్‌ను జనవరి 7వ తేదీన జరుపుకుంటారు.
     క్రిస్మస్‌ చెట్టు ఆచారం కెనడాలో 1781లో ప్రవేశించింది. తర్వాత శతాబ్దంలో ఆ ఆచారం అమెరికాలోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఇళ్లల్లో అలంకరించుకునే క్రిస్మస్‌ ట్రీ 20వ శతాబ్దంలో ఇళ్ల బయటకు వచ్చాయి. అమెరికాలో అనేక బహిరంగ ప్రదేశాల్లో, కూడళ్లల భారీ క్రిస్మస్‌ చెట్లను అమర్చడం ప్రారంభించారు. 1923 నుండి అమెరికా శ్వేతభవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్‌ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. ప్రతి ఏడాది, ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్మస్‌ వేడుకలు ఆరంభమవుతాయి.

                                                పర్యావరణ హితం కోరుతూ...

ఒకప్పుడు క్రిస్మస్‌ ట్రీ పూర్తిగా అడవుల నుండే సేకరించేవారు. ఇప్పుడు క్రిస్మస్‌ కోసం ఏకంగా లక్షల ఎకరాలలో ఫర్‌, ఫైన్‌ చెట్లను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యుకే దేశాల్లో సాగు చేస్తున్నారు. ప్రతి ఏడూ అమెరికాలో 330 నుండి 360 లక్షల క్రిస్మస్‌ చెట్లు ఉత్పత్తవుతున్నాయి. యూరప్‌లో అంతకు రెట్టింపు ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు 25 రకాల ఫర్‌, ఫైన్‌ చెట్ల జాతులను డిసెంబర్‌ కోసం సాగు చేస్తారు. విత్తనం నుండి సుమారు ఏడు అడుగుల ఎత్తు పెరగడానికి ఒక్కో చెట్టు ఎనిమిది నుండి పుష్కరం (12 ఏళ్లు) సమయం తీసుకుంటుంది.
     కృత్రిమ క్రిస్మస్‌ చెట్లు ఇప్పుడైతే ఎక్కువగా చైనా నుండి దిగుమతి అవుతున్నా ముందుగా రూపొందింది మాత్రం క్రిస్మస్‌ చెట్లు ఆచారం జర్మనీలోనే. అడవుల నరికివేతకు అడ్డు చెప్పే క్రమంలో.. 19వ శతాబ్దంలో, జర్మనీలో ఈకలకి పచ్చ రంగు వేసి, చెట్లలా తయారుచేసేవాళ్లు. ప్రస్తుతం పివిసితో, ఇంకా ఇతర పదార్థాలతో తయారుచేస్తున్నారు. తొలి క్రిస్మస్‌ చెట్టు అమ్మకాలు అమెరికాలో 1850 నుండి ప్రారంభమయ్యాయి. అమెరికాలో రాక్‌ ఫెల్లర్‌ సెంటర్‌లో క్రిస్మస్‌ చెట్టు పెట్టడం 1933 నుండి ఆనవాయితీగా వస్తోంది.

                                                        వింత సంప్రదాయాలు

మానవతా విలువలకు ప్రతీక.. హ్యాపీ క్రిస్మస్‌..!

స్లోవాకియాలో క్రిస్మస్‌ రోజున ఒక విచిత్ర సాంప్రదాయం అమలుచేస్తారు. పెళ్లి కాని వాళ్లు (పెళ్లి కావాల్సిన వాళ్లు) ఆ రోజున గుమ్మానికి వీపు పెట్టి చెప్పును విసురుతారు. ఆ చెప్పు గుమ్మం వైపు తిరిగి పడితే త్వరలో పెళ్లి జరుగుతుందని నమ్ముతారు.

  • పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ రోజు సాంప్రదాయంగా 'టర్కీ' అనే పక్షిని తింటారు. కానీ జపాన్లో చికెన్‌ ఎక్కువగా తింటారు. ఆ రోజు మామూలు కంటే పది రెట్లు ఎక్కువగా ఓ బ్రాండ్‌ ఫ్రైడ్‌ చికెన్‌ అమ్ముడవుతుంది. అలాగే, అంతటా ప్లం కేక్‌ సాంప్రదాయంగా ఉంటే, జపాన్‌లో స్పాంజ్‌ కేక్‌ ఎక్కువ. క్రిస్మస్‌ రోజు తరువాత అమ్మకం కాని కేకులని ఇంక ఎవ్వరూ కొనరు, తినరు. పారేయాల్సిందే!
  • ఫిన్లాండ్‌లో క్రిస్మస్‌ ముందురోజు సాయంత్రం (క్రిస్మస్‌ ఈవ్‌) స్మశానాలకి వెళ్లి, వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. అలాగే, వంటకాలన్నీ బల్లపైనే ఉంచి, ఇంటివారు నేలపై పడుకుంటారు. ఆ రోజు గతించిన తమ వారు వచ్చి భోజనం చేసి, పడుకుని వెళ్లేందుకు వీలుగా అలా చేస్తారు.
  •  స్వీడన్లో గాప్లే పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్‌ ఈవ్‌ అర్ధరాత్రి ఆ మేకను కాల్చి వేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది. అయితే, విశేషమేమిటంటే, పట్టణ అధికారులు ఆ మేక బొమ్మను కాల్చాలని అనుకోరు. దుడుకు యువకులు ప్రతిసారీ దాన్ని కాల్చడం,వారిని శిక్షించడమూ మామూలే.
  • మామూలుగా అయితే క్రిస్మస్‌ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. స్థానిక కథ ప్రకారం.. ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్‌ చెట్టుని అలంకరించే స్థోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్‌ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలెపోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి, సంతోషాన్ని కలిగిస్తాయి.
  • ఇథియోపియాలో క్రిస్మస్‌ని జనవరి ఏడున జరుపుకుంటారు. ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా క్రిస్మస్‌ సంబరాలు, విధివిధానాలుంటాయి. ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషాల్ని నింపాలి.. ఇరుగు-పొరుగు మధ్య సత్సంబంధాలు నెలకొనాలి.. సాటివారిపై ప్రేమ, కరుణ పెరగాలనే. క్రిస్మస్‌లో ఇది స్పష్టంగా తెలుస్తుంది.

-  స్నేహ డెస్క్‌