Mar 10,2023 21:44

ప్రజాశక్తి - భీమడోలు
              మండలంలోని మారుమూల ప్రాంతమైన కురెళ్లగూడెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య పరీక్షా శిబిరం నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థ మానవతా భీమడోలు శాఖ ముందుకు రావడం అభినందనీయమని గ్రామ సర్పంచి జి.నాగగౌతమి తెలిపారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వేదికగా శుక్రవారం మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య పరీక్షా శిబిరం, ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. వైద్య సేవలను వేమగిరికి చెందిన పరమహంస యోగానంద కంటి వైద్యశాల వైద్యులు, సిబ్బంది అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానవత సంస్థ జిల్లా అధ్యక్షులు రామిశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ శిబిరంలో 150 మందికి నేత్రవైద్య పరీక్షలు, 130 మందికి రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. కంటి ఆపరేషన్లు అవసరమైన పది మందికి వేమగిరిలోని కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లను ఉచితంగా చేస్తారన్నారు. 20 మందికి కళ్లజోళ్లు అందించామని తెలిపారు. గ్రామంలో నిర్వహించిన మరొక కార్యక్రమంలో ఇటీవల కాలంలో పూళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు చెందిన కుటుంబాలతో పాటు, గాయాల పాలైన మరొక వ్యక్తి కుటుంబానికి రూ.పదివేల విలువైన నిత్యావసర వస్తువులు, బియ్యం అందించామన్నారు. భీమడోలుకు చెందిన సాయిరాం క్లాత్‌ స్టోర్స్‌ యాజమాన్యం సదరు కుటుంబాల వారికి దుస్తులను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా కేంద్ర కమిటీ సభ్యులు అప్పక రాంబాబు, భీమడోలు శాఖ ఛైర్మన్‌ గుళ్ల నూకరాజు, భీమడోలు శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.