Aug 20,2023 18:55

ప్రజాశక్తి - భీమడోలు
    స్వచ్ఛంద సేవా సంస్థ మానవత భీమడోలు శాఖ అందిస్తున్న సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు సహకరించాలని శాఖ అధ్యక్షులు వట్టి సుగుణాకర్‌ కోరారు. మానవత సంస్థ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మండల పరిధిలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బైపాస్‌ రోడ్డులోని విభాజకాల్లో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు అవసరమైన మొక్కలను గ్రామపంచాయతీతో పాటు స్వచ్ఛంద సంస్థ చైతన్య యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ పి.మాన్సింగ్‌ సమకూర్చారు. మొక్కల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామని శాఖ అధ్యక్షులు తెలిపారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో కరోనా సమయంలో గ్రామ పరిధిలో ఆరోగ్య పరిరక్షణకు సేవలు అందించిన పంచాయతీకి చెందిన నలుగురు పారిశుధ్య కార్మికులకు దుస్తులను అందజేశారు. కురెళ్ళగూడెం గ్రామంలో నిర్వహించిన సంస్థ నెలవారీ సమావేశంలో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో గతనెలలో చేపట్టిన సంక్షేమ, సేవా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత నెల చేపట్టవలసిన సేవా, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మానవత సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యులు రామిశెట్టి గంగాధర రావు, అప్పక రాంబాబు, సభ్యులు పచ్చా వెంకటేశ్వరరావు, టివి ఉమామహేశ్వరరావు, పంచకర్ల సత్యనారాయణ, చిలపర్తి రామానాయుడు, జడ్‌పిటిసి సభ్యులు తుమ్మగుంట భవానీరంగ, డాక్టర్‌ పి.మాన్సింగ్‌ పాల్గొన్నారు.