Aug 21,2023 18:07

ప్రజాశక్తి - ఉండి
            ప్రజలందరూ శాంతి మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా సభ్యులు రుద్రరాజు సూర్యనారాయణరాజు అన్నారు. సోమవారం ఉండి మెయిన్‌ సెంటర్‌లో మానవత మండల అధ్యక్షులు కట్రెడ్డి తాండవ నాగ సత్యనారాయణ అధ్యక్షతన దివ్య జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రుద్రరాజు సూర్యనారాయణరాజు, మాజీ అధ్యక్షులు దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ శాంతి మార్గంలో పయనిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పరిసరాలను పరిరక్షించినవారవుతారని చెప్పారు. మానవత ఉండి కన్వీనర్‌ కొమ్మన నాగబాబు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ మానవత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదేళ్ల నుంచి వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రపంచ శాంతి ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో 500 శాఖలకు పైగా విస్తరించిన మానవత ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మండలంలో తొమ్మిది ఫ్రీజర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పిఆర్‌కె.రాజు, కూనపరాజు వెంకటరామరాజు, దివ్య జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నేడు గణపవరంలో శాంతి ర్యాలీ
           గణపవరం :మానవత సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం గణపవరంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు సంస్థ ఉపాధ్యక్షులు బుద్ధారపు పుల్లయ్య తెలిపారు. స్థానిక డిగ్రీ కాలేజీ నుంచి పోలీస్‌ ఐలాండ్‌ వరకు శాంతి ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ర్యాలీలో ఎంఎల్‌సి మోషేన్‌రాజు, స్థానిక ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గంట పద్మశ్రీ, ఎంపిపి దండు వెంకటరామరాజు పాల్గొంటారని తెలిపారు.