ప్రజాశక్తి - భీమడోలు
స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ గాంధీ జయంతి పురస్కరించుకొని మండల పరిధిలో మంగళవారం పలు ప్రోత్సాహక, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని శాఖ ఛైర్మన్ జి.నూకరాజు తెలిపారు. ఈక్రమంలో రూ.58 వేల నగదును, రెండు కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుస్తులను అందజేశారన్నారు. దీనిలో భాగంగా పేదరికంతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న ముగ్గురు విద్యార్థులకు(ఒకరు బిఎస్‌సి నర్సింగ్, ఒకరు ఇంజినీరింగ్, ఒకరు పాలిటెక్నిక్) వారి ప్రతిభ ఆధారంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు వంతున సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాలను శాఖకు చెందిన జిల్లా కార్యవర్గ, శాఖ సభ్యులు ముగ్గురు సమకూర్చారు. ఇదే క్రమంలో అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక విలేఖరికి సంస్థ తరఫున రూ.5 వేలు, సభ్యులు తరపున రూ.3 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎంఎం పురంలో అనారోగ్యం కారణంగా వైద్యానికి ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇదేవిధంగా పూళ్ళ గ్రామంలో వృద్ధాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక కుటుంబానికి భీమడోలుకు చెందిన శ్రీసాయిరాం క్లాత్ స్టోర్ వారి సౌజన్యంతో నిత్యావసర వస్తువులు, బియ్యం, దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు వట్టి సుగుణాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పక రాంబాబు, విశ్రాంత ఉపాధ్యాయులు పి.బ్రహ్మరావు, శాఖ కార్యదర్శి ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










