Jun 14,2021 07:03

సాహిత్యం నిత్య చరిత
సాహిత్యం సాధు చరిత
సాహిత్యం నిత్య హరిత
మారుతున్న బతుకు బాటల్లో
సాహిత్యం మారకున్న అది శవమే
మారినచో అది శివమే !
కవికి, కవితకు ఉండాల్సిన లక్షణాలని ఆనాడే చెప్పిన నాగభైరవ కోటేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకట సుబ్బారావు, రాఘవమ్మల దంపతులకు జన్మించారు. రావినూతల లో ప్రాధమిక విద్యను, ఒంగోలు ఏబీఎం హైస్కూల్లో సెకండరీ విద్యను, గుంటూరు హిందూ కాలేజీలో కొంతకాలం డిగ్రీ విద్యను అభ్యసించిన పిదప, సెకండ్‌ గ్రేడ్‌ టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వారు అనేక రచనలు చేసి ఆంధ్రదేశం సుప్రసిద్ధులయ్యారు.
నా ఉదయం
తూర్పు వాకిలిలో నుంచి కాదు
మనసు మార్పులో నుంచి పుడుతుంది
నేను మానవుడ్ని
పరిపూర్ణ కిరణ ప్రచండ భానుడిని
సంఘం మారాలని ఆశించేవాడ్ని
మారి తీరాలని శాసించేవాడిని మాత్రం కాదు.... అంటారు.
ప్రముఖ కవిగా, సాహితీవేత్తగా, సినిమా పాటల రచయితగా, సంప్రదాయ చంధో కవితా రచనల్లోనూ అందె వేసిన చేయిగా, పరిణితి పరిపక్వత చెందిన వీరు కవి కులానికే మార్గదర్శకునిగా విశేషకీర్తినార్జించారు.
నేను పల్లెటూరి పైరగాలిని..
నల్లరేగడి చేలో రైతు నాగలిని..
నేను రాసేది ప్రజా చైతన్యం కోసం
ఎదురు చూసేది
నూతన సమాజంకోసం.. అన్న మాటలు వారికి సరిగ్గా సరిపోతాయి. స్వయంకృషితోనే, స్నాతక విద్యనభ్యసించి సెకండ్‌ గ్రేడ్‌ టీచర్‌ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు అధ్యాపకునిగా ఎదిగారు.
నా కవిత్వంలో/ ఎత్తులే తప్ప/ లోతులే లేవు
ధర్మాలే తప్ప/ మార్మాలే లేవు
అని సగర్వంగా చెప్పి, కాలం వెంట నడిచిన కవి. కవిత్వంలో అదునూ, పొదునూ తెలిసిన సౌమ్యమైన అభ్యుదయవాది. సామాజిక అభ్యుదయ మార్పుని స్వాగతించి, తన 77 ఏళ్ల జీవితంలో 50 ఏళ్ళు కవిత్వమే శ్వాసగా, ధ్యాసగా, జీవించి ఎంతోమంది శిష్యులను ఆస్తిగా భావించిన గొప్ప ఋషి. సమాజ శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ, వీరి రచనల్లో కనిపించే ప్రధాన దృక్కోణాలు.
రంగాజమ్మ, గుండ్లకమ్మ చెప్పిన కధ, తూర్పు వాకిళ్ళు, ఒయాసిస్‌, కన్నీటిగాధ, వెలుతురు స్నానం, నా ఉదయం, సంతకం, మానవతా గీతం, చిన్నారుల కోసం కన్నెగంటి హన్మంతు, దానవీర, మరో అమ్మాయి వంటి రచనలు చేసి, నవ సమాజం కోసం పరితపించారు. సినిమా రంగంలో కూడా పలు పాటలు రాసారు. గడుసు అమ్మాయి, గిరిబాబు గారి దేవతలారా దీవించండి, సింహగర్జన, ముద్దూ ముచ్చట, వసంతం వచ్చింది, పూలపల్లకి, వంటి చిత్రాలకు పాటలు రాసారు. సుమన్‌ కధానాయకుడుగా రూపొందిన 'భార్గవ్‌' చిత్రానికి సంభాషణలు అందించారు. నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వం వహించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' చిత్రానికి సైతం డైలాగులు రాసే అరుదైన అవకాశం వీరికి దక్కింది.
బకాసురుణ్ణి నేను బతికే ఉన్నాను
నరకాసురుణ్ణి నేను చావలేదు
నేను కాల్చింది లింకన్‌నే కాదు
మానవత్వాన్ని కూడా..
నేను కూల్చింది గాంధీనేనా
శాంతి కాపోతాన్ని కూడా..
నేను చంపింది కెన్నడిని,
లూధర్‌ కింగ్‌ ని మాత్రమే కాదు
మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా..
మనిషిని, మానవత్వాన్ని ప్రతిసారీ గుర్తు చేస్తూ, మనిషికి పక్కదారి, వక్రమార్గం సరికాదని, హింసని త్యజించాలని అన్నారు నాగభైరవ.
ఎరుగని/ ఎదుగని/ నీ హృదయానికి
ఎప్పుడొచ్చెనో/ ఓటు హక్కు..
అప్పుడే/ నీ బతుకులోన/ దాపురించే/ వింత చిక్కు...
యువత ఏవిధంగానైనా ఓటుహక్కు దుర్వినియోగం చేయరాదంటారు.
పిల్లల మీద/ బంధువుల మీద/ బజారు రౌడీల మీద
అఖరుకు నామీద నాకే/ కోపమొచ్చినప్పుడల్లా...
జాతీయ పతాకం/ వైపుచూస్తాను..
నా కోపం పోతుంది/ ఎందుకంటే జెండాయే
నా గుండె కాబట్టి... '' అని తన జాతీయతను చాటుకున్న కవి. రిపబ్లిక్‌ డే సందర్బంగా ఢిల్లీ పుర వీధిలో తెలుగు కవిత వినిపించిన తెలుగుజాతి కవి. ఆరుద్ర గారి 100 వ్యాసాలకు వచ్చే కీర్తి, నాగభైరవ గారి ఒక్క 'కవన విజయం' రూపక ప్రదర్శనకు దక్కుతుంది అని ఆరుద్రగారితోనే అనిపించుకున్నారు.
15 ఆగష్టు 1931లో జన్మించిన నాగభైరవ కోటేశ్వరరావు 14 జూన్‌ 2008లో మరణించారు. గౌడ డిండిమభట్టుని ఓడించి అతని గుర్రపు డెక్కని పగలగొట్టిన శ్రీనాధకవిసార్వభౌమునికి కర్ణాటక రాజ్యం కనకాభిషేకం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తన కవితా గానంతో విజయ దుందుభి మోగిస్తున్న ఈ కవిరాజుకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం 1999లో కనకాభిషేకం చేసింది. ఈ అరుదైన గౌరవం ఇటీవల కాలంలో ఆయనకి మాత్రమే దక్కింది.
ఆయన కాలంలో ఎవరైతే పెద్ద కవులున్నారో వారికి జైకొట్టినవాడు.. ఆయన కాలంలో ఎవరైతే యువకవులున్నారో వారి భుజం తట్టి, పెన్ను తట్టి, ప్రోత్సహించిన వారు నాగభైరవ. చాలా జిల్లాలకు వారి వారి జిల్లా గీతం లేదు. ప్రకాశం జిల్లా గీతం రాసి, అధికార ముద్రతో అన్ని పాఠశాలల్లో ఆలపించబడింది వారి గీతం. అధ్యాపకునిగా, కవిగా, విలువలు కల్గిన ఉన్నత వ్యక్తిగా వారు సాధించిన అవార్డులు చాలానే ఉన్నాయి. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి గారి సత్కారం, రాజ్యలక్ష్మి -వెంకన్న చౌదరి అవార్డు, గడియారం వెంకట శేషశాస్త్రి అవార్డు వంటి ఎన్నో ఉన్నాయి. తెలుగు విశ్వ విద్యాలయం సిండికెట్‌ మెంబర్‌, అధికార భాషా సంఘం సభ్యుడు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు, ఎలిమెంటరీ పాఠశాలల భాషా సిలబస్‌ కమిటీ చైర్మన్‌, సెన్సార్‌ బోర్డు మెంబెర్‌, దూరదర్శన్‌ స్క్రీనింగ్‌ కమిటీ మెంబర్‌ తదితర పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర సదస్సుని ఒంగోలులో 1974లో నిర్వహించి, ఆరుద్ర, దాశరధి, చాసో కలిసి జతకట్టి దిగ్విజయం చేశారు. తను మరణించే వరకు అరసంలోనే కొనసాగి, రాష్ట్ర ఉపాధ్యక్షునిగానే మరణించారు. ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై 33 మంది తెలుగు ప్రముఖుల శిలా విగ్రహాలు ప్రతిష్టించిన సందర్భంలో గురజాడ గారి విగ్రహానికి పరిచయ వాక్యం రాసి ఎన్టీఆర్‌ మన్ననలు పొందారు. అధ్యాపకునిగా రిటైర్డ్‌ అయిన తర్వాత ఒంగోలు పరిసర గ్రామీణ ప్రాంతంలో నాగభైరవ విద్యాసంస్థలు నెలకొల్పారు. నాగభైరవ కళా పీఠం ఏర్పాటు చేసి ఎందరో కవులను రచయితలను సత్కరించారు. దానికి కొనసాగింపుగా వారి సోదరులు నాగభైరవ సాహిత్య పీఠం ఏర్పరచి ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు.

(నేడు నాగభైరవకోటేశ్వరరావు కోటేశ్వరరావు గారి వర్ధంతి)
- ధర్నాశి చిరంజీవి
70950 91228