May 05,2022 06:33
  • శ్రామికులచే ఉత్పత్తి చేయబడిన 'అదనపు విలువ' పెట్టుబడిదారుని అత్యధిక లాభాలకు కారణమని ప్రప్రథమంగా మార్క్సే పేర్కొన్నాడు. సరుకుల ఉత్పత్తి, చెలామణి, వినియోగం సందర్భంగా అదనపు విలువ ఎలా ఏర్పడుతుందో, శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో విశ్లేషించి నిరూపించాడు. ఆ దోపిడీని రద్దు చేయడం ద్వారానే శ్రామికవర్గం విముక్తి సాధిస్తుందని వివరించాడు. రాజ్యాంగ యంత్రం, ఆస్తి ద్వారా యాజమాన్యం కార్మిక వర్గాన్ని అణచి వేస్తుందని పేర్కొంటూ కార్మికవర్గం సమస్యల నుండి బయట పడాలంటే సంఘటితంగా పోరాటాలు సాగించాలన్నాడు. అందుకోసం ఒక సిద్ధాంత ప్రాతిపదికన పని చేసే రాజకీయ పార్టీ అవసరమన్నాడు. కమ్యూనిస్టు పార్టీలు చేయాల్సిన కృషి అవసరాన్ని తెలిపాడు. విప్లవాల ద్వారా సమాజంలో మార్పునకు ప్రయత్నం సాగాలన్నాడు. ఆ విధంగా సోషలిజానికి, కమ్యూనిజానికి... సమాజం, మానవాళి ముందుకు సాగే సూత్రాలను వివరించాడు.

శ్రామికులచే ఉత్పత్తి చేయబడిన 'అదనపు విలువ' పెట్టుబడిదారుని అత్యధిక లాభాలకు కారణమని ప్రప్రథమంగా మార్క్సే పేర్కొన్నాడు. సరుకులు ఉత్పత్తి, చెలామణి, వినియోగం సందర్భంగా ఏర్పడే అదనపు విలువను, జరిగే శ్రమ దోపిడీలను విశ్లేషించి నిరూపించాడు. ఆ దోపిడీని రద్దు చేయడం ద్వారానే శ్రామికవర్గం విముక్తి సాధిస్తుందని వివరించాడు.
కారల్‌ మార్క్స్‌ పుట్టి మే 5కి రెండు వందల మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. 1001-2000 సంవత్సరాల మధ్య జన్మించిన వారిలో ప్రపంచం మీద అత్యధికంగా ప్రభావం చూపిన వ్యక్తి కారల్‌ మార్క్స్‌ అని బిబిసి సర్వేలో కూడా తేలింది. మార్క్స్‌ 1818 మే 5న ప్రష్యా (నేటి జర్మనీ) లోని ట్రయర్‌ పట్టణంలో హెన్రిచ్‌ మార్క్స్‌, హెన్‌రీట్టే ప్రెస్‌బర్గ్‌ దంపతులకు ఐదవ బిడ్డగా పుట్టాడు. మొదట బాన్‌ విశ్వవిద్యాలయం లోను తర్వాత బెర్లిన్‌ విశ్వవిద్యాలయం లోను చేరి న్యాయశాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం అధ్యయనం చేశాడు. 1843 జూన్‌ 12న వాన్‌వెస్ట్‌ఫాలెన్‌ కుమార్తె, సంపన్న కుటుంబానికి చెందిన జెన్నీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య జెన్నీతో పాటు కారల్‌ మార్క్స్‌ జీవితంలో ఎంతగానో పెనవేసుకుపోయిన వ్యక్తి ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌. ప్రష్యన్‌ ప్రభుత్వం మార్క్స్‌ రచనలు, భావాలను అడ్డుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నించింది. దేశం నుండి బహిష్కరించింది. అంతేకాదు. పారిస్‌ కు వెళ్ళినా 1845లో పారిస్‌ నుండి వెళ్లగొట్టారు. అక్కడ నుండి బెల్జియం లోని బ్రస్సెల్స్‌ నగరానికి వెళ్లాడు. అక్కడ జర్మన్‌ సిద్ధాంత గ్రంథాన్ని రచించాడు. 1848 ఫిబ్రవరి 21న యంగ్‌ కమ్యూనిస్ట్‌ లీగ్‌ కోరిక మేరకు మార్క్స్‌, ఏంగెల్స్‌లు రాసిన 'కమ్యూనిస్టు ప్రణాళిక' లండన్‌ నగరంలో విడుదలైంది. ప్రపంచంలో ఉన్న సోషలిస్టులకు, కమ్యూనిస్టులకు శాస్త్రీయ పంథాను చూపించింది. 23 పేజీల ఆ చిన్న పుస్తకం వందలాది గ్రంథాలతో సమానం.
1842 అక్టోబరులో మార్క్స్‌ ప్రధాన సంపాదకుడుగా కొలోన్‌లో 'రైనిష్‌ జైటుంగ్‌' పత్రిక ప్రారంభమైంది. తన భావాల ప్రచారానికి ...ప్రభుత్వ దుష్ట విధానాలను, ప్రజల దుస్థితినీ అందరికీ తెలియచేయడానికి పత్రికా సంపాదకుడుగా, విలేకరిగా ప్రయత్నించాడు. మార్క్స్‌ను బెల్జియం నుంచీ వెళ్లగొట్టారు. మొదట పారిస్‌కు, తర్వాత కొలోన్‌కు వెళ్లాడు. అక్కడ 'న్యూ రైనిష్‌ జైటుంగ్‌' పత్రికను తిరిగి ప్రారంభించి నడిపాడు. అది జర్మనీ లోని విప్లవాన్ని బలపరిచే వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ నిర్బంధంతో దాన్ని 1849 మే నెలలో శాశ్వతంగా మూసివేశారు. జర్మనీ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా మార్క్స్‌ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఆయన ఏ దేశానికి చెందని వ్యక్తిగా, ప్రపంచ పౌరునిగా లండన్‌లో తన జీవితాన్ని ప్రారంభించి ఆఖరి వరకు 'ప్రపంచ పౌరుడిగానే' జీవించాడు. మార్క్స్‌, ఏంగెల్స్‌ వంటి వారి కృషితో 1864లో లండన్‌ నగరంలో అంతర్జాతీయ కార్మిక సంఘం 'ప్రథమ ఇంటర్నేషనల్‌' స్థాపించబడింది. జర్మనీ లోనూ, ఆ తరువాత లండన్‌ లోనూ మార్క్స్‌ కుటుంబం దుర్భర దారిద్య్రం అనుభవించింది. వారి పిల్లల్లో ముగ్గురు తమ చిన్నతనం లోనే లండన్‌లో చనిపోయారు. ఇంత దారిద్య్రం, కష్టాలలోనూ మార్క్స్‌ తన కృషిని కొనసాగించాడు. 1881 డిసెంబర్‌లో మార్క్స్‌ భార్య జెన్నీ అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణానంతరం మార్క్స్‌ ఎంతో వేదనకు గురయినప్పటకీ 'పెట్టుబడి' గ్రంథ రచన కొనసాగించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి
1871లో కార్మికులు తిరగబడి పారిస్‌ నగరంలో అధికారం లోకి వచ్చారు. అదే 'పారిస్‌ కమ్యూన్‌' అయ్యింది. ఆ ప్రయత్నం కొద్ది రోజులలోనే కూల్చి వేయబడింది. ఆ అనుభవాలతో 'ఫ్రాన్సులో అంతర్యుద్ధం' అనే గ్రంథాన్ని మార్క్స్‌ రచించాడు. ఆ తరువాత మార్క్స్‌ తన ప్రధాన కృషి అయిన 'పెట్టుబడి' రచనకు ఉపక్రమించాడు. క్యాపిటల్‌ గ్రంథ రచన కోసం ఆయన సుమారు 25 సంవత్సరాలపాటు నిర్విరామ కృషి చేశాడు. ఎన్నో దేశాల రాజ్యాంగాలు చదివాడు. కష్టపడి కొత్త భాషలు నేర్చుకొని మూల గ్రంథాలు చదివేవాడు. మార్క్స్‌ భావాలను, సిద్ధాంతాలను, సహకారాన్ని ఉపయోగించుకుని అనేక దేశాలలో రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. 1870లో కార్మికవర్గ విప్లవ పార్టీలు ఏర్పడ్డాయి. ఫ్రాన్స్‌ వర్కర్స్‌ పార్టీ కార్యక్రమాన్ని రూపొందించడంలో మార్క్స్‌ సహాయపడ్డాడు. డార్విన్‌ ప్రకృతి శాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. జీవుల, జాతుల ఆవిర్భావం, మనుగడకై పోరాటం మొదలైన వాటిని పరిశీలించాడు. సైన్సు గురించి తన అభిప్రాయం చెబుతూ 'ఒకదానితో ఒకటి అల్లుకుపోతూ పరస్పర సంబంధాలు కల్గిన అసంఖ్యాకమైన నిజాల కూడికే సైన్స్‌' అన్నాడు మార్క్స్‌. సాహిత్యంలో మార్క్స్‌కు మంచి పరిచయం వుంది. ఆయనకు ప్రఖ్యాత జర్మన్‌ కవులైన 'హైన్‌', 'గోథే'ల కవిత్వం వచ్చు. తన సంభాషణల్లో తరచూ వాళ్లను ఉటంకించేవాడు. షేక్‌స్పియర్‌ నాటకాల లోని అతి చిన్న పాత్ర కూడా మార్క్స్‌కు తెలుసు. అన్ని యూరోపియన్‌ భాషలు చదవడం వచ్చు. జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లీషు భాషలు రాయడం వచ్చు. 50 ఏళ్ల వయసులో రష్యన్‌ భాష నేర్చుకుని అనేక గ్రంథాలు చదివాడు. రష్యన్‌ రచయితలు పుష్కిన్‌, గొగోల్‌, తుర్ఘినోవ్‌లు ఆయనకు ఇష్టమైనవారు. ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన లండన్‌ లైబ్రరీ లోని 18 వేల గ్రంథాలను చదివిన మొదటి వ్యక్తి మార్క్స్‌. గణిత శాస్త్రం మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం వుంది.
ప్రపంచానికి అందించిన సిద్ధాంతాలు
మార్క్స్‌ రూపొందించిన, అభివృద్ధి చేసిన సిద్ధాంతమే తర్వాత కాలంలో ప్రపంచమంతటా మార్క్సిజం లేదా శాస్త్రీయ సోషలిజం పేరుతో ప్రచారంలో వుంది. భౌతికవాదులు 'డిడిరో, డెకార్తె' రూపొందించిన 'అది భౌతికవాదం' లోని లోపాన్ని సరిచేసి ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి 'గతితార్కిక భౌతికవాదం' అనే సమగ్ర సిద్ధాంతాన్ని అందించాడు. గతితార్కిక సూత్రాలను చరిత్రకు వర్తింపచేయడం ద్వారా 'చారిత్రక భౌతికవాదం' రూపొందించాడు. మానవ సమాజం తక్షణ భౌతిక అవసరాల గురించి జరిగే ఉత్పత్తి క్రమంలో ఏదో ఒక రకమైన ఉత్పత్తి సంబంధాలను ఏర్పరచుకొంటుందని, ఈ ఉత్పత్తి సంబంధాల మార్పే మొత్తం మానవ సమాజ మార్పుకు దారితీస్తుందని సూత్రీకరించాడు. 'వర్గ పోరాటమే సమాజ పురోగతికి చోదక శక్తి' అని ప్రకటించాడు. పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఆడమ్‌ స్మిత్‌, డేవిడ్‌ రికార్డో వాదనలు శ్రమశక్తి యొక్క అసలు విలువను కనుగొనటంలో ఎలా విఫలమయ్యాయో తన 'పెట్టుబడి' గ్రంథంలో నిరూపించాడు. మార్క్స్‌ ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతాన్ని తన ప్రసిద్ధ, ప్రధాన కృషి అయిన 'పెట్టుబడి' గ్రంథం ద్వారానూ అంతకు ముందే ప్రచురించిన వివిధ గ్రంథాల ద్వారానూ వివరించాడు. శ్రామికులచే ఉత్పత్తి చేయబడిన 'అదనపు విలువ' పెట్టుబడిదారుని అత్యధిక లాభాలకు కారణమని ప్రప్రథమంగా మార్క్సే పేర్కొన్నాడు. సరుకుల ఉత్పత్తి, చెలామణి, వినియోగం సందర్భంగా అదనపు విలువ ఎలా ఏర్పడుతుందో శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో విశ్లేషించి నిరూపించాడు. ఆ దోపిడీని రద్దు చేయడం ద్వారానే శ్రామికవర్గం విముక్తి సాధిస్తుందని వివరించాడు. రాజ్యాంగ యంత్రం, ఆస్తి ద్వారా యాజమాన్యం కార్మిక వర్గాన్ని అణచి వేస్తుందని పేర్కొంటూ కార్మికవర్గం సమస్యల నుండి బయట పడాలంటే సంఘటితంగా పోరాటాలు సాగించాలన్నాడు. అందుకోసం ఒక సిద్ధాంత ప్రాతిపదికన పని చేసే రాజకీయ పార్టీ అవసరమన్నాడు. కమ్యూనిస్టు పార్టీలు చేయాల్సిన కృషి అవసరాన్ని తెలిపాడు. విప్లవాల ద్వారా సమాజంలో మార్పునకు ప్రయత్నం సాగాలన్నాడు. ఆ విధంగా సోషలిజానికి, కమ్యూనిజానికి...సమాజం, మానవాళి ముందుకు సాగే సూత్రాలను వివరించాడు. డార్విన్‌ ఎలా ప్రకృతి పరిణామ సూత్రాలను కనుగొన్నాడో అలాగే మార్క్స్‌ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాలను ఆవిష్కరించాడు. పెట్టుబడిదారీ సమాజాన్ని, అది సృష్టించిన రాజ్య సంస్థలను కూలదోయడంలో ఏదో విధంగా తోడ్పడడంలోనూ...ఆధునిక కార్మిక వర్గానికి దాని స్థానాన్ని గురించీ దాని విముక్తి నియమాల గురించీ చెప్పి చైతన్యవంతం చేయడంలోనూ ఆయనే ప్రథముడుగా ఉన్నాడు.
పోరాటం ఆయన ఊపిరి. ఆవేశం తోనూ, పట్టుదల తోనూ ఆయన పోరాడాడు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం. నియంతృత్వ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండూ తమ దేశాల నుండి మార్క్స్‌ను బహిష్కరించాయి. బూర్జువాలు, మితవాదులైన, ప్రజాతంత్రవాదులైన వారు కూడ ఆయన మీద నిందలు గుప్పించడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఆయన 'సైబీరియా గనుల నుండి కాలిఫోర్నియా దాకా యూరప్‌, అమెరికాల లోని కోట్లాది మంది విప్లవ కార్మికులచే ఆరాధించబడిన కారల్‌ మార్క్స్‌ 1883 మార్చి 14న మరణించాడు. ఆయనకు చాలా మంది వ్యతిరేకులు వున్నప్పటికీ...వ్యక్తిగతంగా ఒక్క శతృవు కూడా లేడని చెప్పవచ్చు. ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన కృషి కూడా అంతే' అని మార్క్స్‌ ఆప్తమిత్రుడు ఏంగెల్సు అన్న మాటలు నేటికీ ప్రపంచమంతటా మార్మోగుతున్నాయి.

- గుడిపాటి నరసింహారావు

/ వ్యాసకర్త సెల్‌ : 9490098559 /