
ప్రజాశక్తి -అనకాపల్లి
ప్రపంచ మానవాళి విముక్తి కోసం భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా, అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా తుది శ్వాస వరకూ పోరాడిన ధీరుడు, కోట్లాది మంది యువత గుండెల్లో నిలిచిన గెరిల్లా యోధుడు చే గువేరా అని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల శివాజీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కోశాధికారి గొర్లి తరుణ్, సామాజిక న్యాయవాది గంటా సురేష్ అన్నారు. చే గువేరా 95వ జయంతి సందర్భంగా స్థానిక దొడ్డి రామునాయుడు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి సామాజిక న్యాయవాది గంటా సురేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో పట్టభద్రుడైన చే గువేరా 1949లో అర్జెంటీనాలో ఒంటరిగా, 1952లో మిత్రుడు ఆల్బర్ట్ గ్రినిడాతో కలిసి లాటిన్ అమెరికా మొత్తాన్ని బైక్ యాత్ర ద్వారా తిరిగారని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాద కంపెనీలు ప్రజలను ఎలా దోచుకుంటున్నాయో అర్థం చేసుకున్నాడని, దోపిడీని అరికట్టాలని, పేద ప్రజలకు అండగా నిలబడాలని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడని పేర్కొన్నారు. వైద్యుడిగా కొంతమంది రోగులకు వైద్యం చేసే బదులు సమాజానికి పట్టిన అత్యంత ప్రమాదకరమైన జబ్బును వదిలించాలని భావించాడని చెప్పారు. దోపిడీ సమాజాన్ని కూల్చేయడం మినహా మరో మార్గం లేదని నమ్మి దాని కోసం తన ప్రాణాలను సైతం బలిపెట్టాడని తెలిపారు. శత్రువుల వ్యూహాలను పసిగట్టి ఎత్తులకు పైఎత్తులు వేసి శత్రువు సైన్యాన్ని చిత్తు చేయడంతో ఆయన దిట్ట అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోని కాశీ, చలపతి, నాయుడు పాల్గొన్నారు.
నక్కపల్లి: విప్లవ వేగుచుక్క చే గువేరా 95వ జయంతినిస్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు చే గువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎం.అప్పలరాజు మాట్లాడుతూ విప్లవ వేగుచుక్క చేగువేరా పేరులోనే ఉత్తేజం, చైతన్యం ఉందన్నారు. నేటితరానికి ఎంతోస్ఫూర్తి, మార్గదర్శి చేగువేరా అన్నారు. ప్రపంచంలో అసమానతలు రూపుమాపాలని, పేదరికం లేని సమసమాజం రావాలని, సామ్రాజ్యవాదం నశించాలని పోరాడిన యోధుడు చేగువేరా అని, ఆయన ఆశయ సాధనకు నేటితరం యువత ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో పిక్కి రాజు,పిక్కిరాము తదితరులు పాల్గొన్నారు.