ప్రజాశక్తి - ఆరిలోవ : మానవ తప్పిదాల వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని క్యూ వన్ హాస్పిటల్ అధినేత, ఛీఫ్ రోబొటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ టి.రమణమూర్తి అన్నారు. బుధవారం జాతీయ బోన్ అండ్ జాయింట్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'స్ట్రాంగ్ బోన్, స్ట్రాంగర్ ఇండియా' నినాదంతో ఆరిలోవ, హెల్త్‌సిటీ, క్యూవన్ ఆసుపత్రి సమావేశ మందిరంలో 'మస్క్యులూస్ డిజార్డర్స్, వాటి నివారణ చర్యలు, ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ భారత్ రోడ్డు ప్రమాదాల మరణాలు 11శాతంగా ఉందని, దీనికంతటికీ మానవ తప్పిదాలే ముఖ్యకారణమన్నారు. దీన్ని అధిగమించాలంటే విద్యార్ధి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు, బెటర్ రోడ్ ఇంజనీరింగ్ సౌకర్యాలు కల్పన ద్వారా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఎపిలో కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు ఎక్కువగా చేసిన ఘనత క్యూ వన్ ఆసుపత్రికే దక్కుతుందన్నారు.










