మాజీ ఎమ్మెల్సీ ఎంవివిఎస్.శర్మ
ప్రజాశక్తి -మాధవధార నివాస ప్రాంతాల్లో సఖ్యతగా ఉన్న మానవ సంబంధాల మధ్య నేటి ప్రభుత్వాలు చిచ్చు పెడుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌వివిఎస్ శర్మ అన్నారు. శుక్రవారం మురళీనగర్ అమ్మ రెసిడెన్సీలో విశాఖపట్నం అపార్ట్‌మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(వార్వ), గ్రేటర్ విశాఖ కాలనీ ప్రెసిడెంట్ సంఘాల సమాఖ్య (నివాస్) సంయుక్త సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్రోద్యమ నేపథ్యాన్ని శర్మ వివరించారు స్వాతంత్య్ర సాధనకు ఎంతోమంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారన్నారు. దేశ సంపదను నాడు బ్రిటీషర్లు కొల్లగొడితే, స్వాతంత్య్రానంతరం తొలినాళ్లలో పాలించిన పాలకులు ప్రజాధనంతో దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. కానీ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాభివృద్దిని నిర్వీర్యం చేస్తోందని, ప్రజల సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. నాలుగు నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమించి, కేంద్రం మెడలు ఒంచి విజయం సాధించిన రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వార్వ అధ్యక్షులు ప్రకాశరావు మాట్లాడుతూ తాగునీరు, చెత్త, ఇంటిపన్నులను పెంచి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజానీకం వ్యతిరేకించినప్పటికీ చెత్తపన్నును ప్రజలపై రుద్దడం దుర్మార్గమన్నారు. పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్వ జిల్లా కార్యదర్శి గణేష్, నివాస్ అధ్యక్షులు నారాయణమూర్తి, కంచరపాలెం కార్యదర్శి నాయుడుబాబు, మురళీనగర్ మాధవధార కన్వీనర్ కె సత్యనారాయణ పాల్గొన్నారు.










