Aug 29,2021 07:56

పెద్దయితే సైన్యంలో చేరాలని, అలా కుదరకపోతే డాక్టరైనా అయ్యి ఈ దేశానికి సేవ చేయాలని ఆమె అనుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తన కల ఎప్పటికీ నెరవేరదనే వాస్తవాన్ని అతి తక్కువ కాలంలోనే ఆమె గ్రహించారు. వీధి నివాసితులు, యాచకులు, నిరాశ్రయులు, ఒంటరి వ్యక్తులకు తాను అండగా ఉండాలని 'జీవితం ఫౌండేషన్‌' ను స్థాపించారు. ఇప్పటివరకూ 340 మందికి పైగా పునరావాసం కల్పించారు. సుమారు 54 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆమే తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల మనీషా కృష్ణసామి. మీకోసం నేనున్నాను అంటూ సమాజ సేవ చేస్తున్న ఆమె ఏం చేస్తుందో తెలుసుకుందాం...మానవ సేవే ఆమె 'జీవితం'!
మనీషా కృష్ణసామి తమిళనాడులోని ఈరోడ్‌ నగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మాంసం దుకాణం నడిపేవారు. తల్లి గృహిణి. ఆమె ఈ సేవారంగంలోకి ఎలా వచ్చింది? ఏం చేస్తున్నది అంటే.. 'చిన్నప్పటి నుంచి వీధుల్లో నివసించే నిరాశ్రయులను చూస్తే నా మనస్సు తరుక్కుపోయేది. నాన్న దుకాణంలోనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసి, వచ్చిన డబ్బుతో ఆహారం కొని, పేదలకు ఇచ్చేదాన్ని. సైన్యంలో చేరాలనే కోరికగానీ, డాక్టరవ్వాలనే ఆశగానీ ఎప్పటికీ తీరవని అర్థమైంది. అందుకే నా వంతుగా ఈ దేశానికి ఏమైనా చేయాలి అనుకున్నా. మొదట్లో ఒక ఎన్‌జీవోతో కలిసి పనిచేశా. కొంతకాలానికి వారు అమ్మాయిననే నెపంతో ఎక్కడికీ తీసుకెళ్లేవారు కాదు. దాంతో అక్కడ నుంచి బయటకు వచ్చేశా. 'జీవితం ఫౌండేషన్‌' ను స్థాపించాను. ముందుగా వీధి శివార్లలో, రోడ్ల మీద నివసించే వ్యక్తులను గుర్తిస్తాను. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరి నుంచి ఆ వ్యక్తి గురించి సమాచారాన్ని సేకరిస్తా. ముఖ్యంగా ఆ వ్యక్తి ఎన్ని రోజుల క్రితం ఆ ప్రాంతానికి వచ్చాడు? ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు? అతని ప్రవర్తనా తీరు ఎలా ఉంది? వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? తదితర వివరాలు కనుక్కుంటాను. చివరిగా వాళ్ల దగ్గరకు వెళ్లి పరిచయాన్ని పెంచుకుంటాను. వారితో స్నేహంగా మెలుగుతూనే వివరాలు సేకరిస్తా. తర్వాత తినడానికి తిండి, మందులు, ఇతర అవసరాలను తీరుస్తాను. కుటుంబాలు ఉంటే వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి, కలుపుతాను. అలా కుదరని వాళ్లను ఆశ్రమాల్లో చేరుస్తాను. ఇదంతా చేయడానికి వారం నుంచి నెలరోజులు సమయం పడుతుంది' అంటోంది మనీషా. మానవ సేవే ఆమె 'జీవితం'!
మనీషా 2017లో జెకెకె నటరాజా విద్యా సంస్థ నుంచి నర్సింగ్‌ ప్రొఫెషనల్‌గా పట్టభద్రురాలయ్యారు. కొంతకాలం నందా కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అప్పట్లో సంపాదించిన డబ్బునంతా అనాథల కోసమే ఖర్చు చేశారామె. అంతేకాదు చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు వ్యక్తులను గుర్తించి, డాక్టర్ల సహాయంతో వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో కొందరు ఆమెపై దాడికి దిగిన సందర్భాలున్నాయి. అయినా ఆమె అలాంటి గాయాలను లెక్క చేయలేదు. ఆశ్రమాల్లో ఆమె చేర్చిన కొంతమంది అనతికాలంలోనే మామూలు మనుషులై, అక్కడే పనిచేసుకుంటూ కనిపిస్తారు. ప్రస్తుతం ఆమె సమయమంతా ఎన్‌జీవోకే కేటాయిస్తున్నారు. అందులో 17 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
'నా ఏకైక బంధువు'
'మనీషా నన్ను తల్లిలాగే చూసుకుంది. మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆమె లేని దిగులులో పనిచేయలేకపోయాను. యాచించి బతికేవాడ్ని. బంధుమిత్రులు ఎవరూ సహాయం చేయలేదు. దాంతో మద్యానికి బానిసనయ్యా. 2021 ప్రారంభంలో మనీషా నన్ను మార్చేశారు. పవర్‌లూమ్‌ కోర్సులో చేర్పించారు. ప్రస్తుతం రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నా. ఆ డబ్బుతోనే రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్‌ కొన్నా. మొదటి కాల్‌ మనీషాకే చేశాను. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఏకైక బంధువు మనీషానే' అంటున్నారు మనీషా ప్రయత్నంతో మామూలు మనిషైన రమేష్‌.
'అనాథలకు సహాయం చేయాలంటే దయచేసి ఆహారం, బట్టలు, వారికి అవసరమైన వస్తువులను మాత్రమే ఇవ్వండి. డబ్బు పొరబాటున కూడా ఇవ్వవద్దు. ఎందుకంటే వారు చెడు వ్యసనాలకు బానిసలవుతారు' అంటున్నారు మనీషా. వీధి నివాసితులను గుర్తించాలన్నా, వారిని ఆశ్రమాలకు తరలించాలన్నా ఒక వాహనం అవసరం. అలాగే కనీస అవసరాలు తీర్చాలన్నా డబ్బు అవసరం. అందుకోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నారు.
పేరు: జీవితం ఫౌండేషన్‌
A/C: 1619135000027926
IFSC కోడ్‌: KVBL0001619
బ్యాంక్‌: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లేదా
6379965074 వద్ద Google pay & Paytm