Mar 06,2022 05:59

మనదేశంలో మహిళా దినోత్సవాన్ని ''మహిళా పోరాట దినోత్సవం'' గా జరుపుకుంటే సమంజసంగా ఉంటుంది. దీనికి కారణం అన్ని రంగాల్లో మహిళలు అణిచివేతకు, దోపిడీకి అనునిత్యం గురువుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1908లో ప్రారంభమైన మహిళా ఉద్యమం ,వారి హక్కుల కోసం, సాధించిన ప్రగతి సమీక్షించుకుని , భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకునే వేదికలుగా 1975 మార్చి 8వ తేదీ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. పనిగంటలు తగ్గింపు, మంచి వేతనాలు, ఓటు హక్కు కోసం మహిళా ఉద్యమం ప్రారంభమైంది. కొంతమేర అభివృద్ధి సాధించినా, చాలా దేశాల్లో మహిళలు రక్షణ, హక్కులు, అవకాశాలు , అభివృద్ధి అందని ద్రాక్ష వలే నేటికీ ఉండుట గమనార్హం.
ముఖ్యంగా మహిళలు అంటే చులకన భావం, వివక్షత కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఏటా 15 మిలియన్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయి. నేటికీ మనదేశంలో 62 మిలియన్ల బాలికల చదువుకు దూరంగా ఉండుట శోచనీయం. సౌత్‌ కొరియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో మహిళ అక్షరాస్యత అధికంగా ఉంది. మనదేశంలో నేటికీ మహిళా అక్షరాస్యత 55% కంటే తక్కువ ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా 29 కోట్ల మహిళలు/బాలికలు బానిసత్వం, వెట్టిచాకిరీ లో మగ్గిపోతున్నారు. అంబేద్కర్‌ చెప్పిన మాటలు ప్రకారం ''ఒక దేశం యొక్క అభివృద్ధి ఆదేశ మహిళా అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది'' అని తెలిపారు. అనగా మహిళల చదువుమీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి నేటికీ అన్ని ప్రాంతాల్లో బాలికలకు ఉన్నత విద్య, సౌకర్యాలు అందుబాటులో లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతీ సంవత్సరం విద్యకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిస్తుంది. ఏనాడో కొఠారి కమిషన్‌ స్థూల జాతీయ ఉత్పత్తిలో 6% నిధులు విద్యకు కేటాయింపులు చేయాలి అని తెలిపారు. నేటికీ 4% లోపు నిధులు కూడా పూర్తిగా మంజూరు చేయిటలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ నాణ్యమైన విద్య ఎలా అందుతుంది అనేక మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది...
మనది పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ. ఆడపిల్లల అంటే పలచన భావం చాలా కుటుంబాల్లో కనపడుతుంది. ఆడపిల్లలకు చదువు ఎందుకు..? ఉద్యోగాలు వెలగబెట్టాలా...! అనే ధోరణి ఉంది. మగవారు, రాజకీయ నాయకులు మనదేశంలో స్త్రీలను దేవతలతో పోలుస్తారు. నిజ జీవితంలో హీనభావంతో చూస్తారు. వంటగదికే పరిమితం చేయాలని, పిల్లలను కనే యంత్రంగా చూస్తారు. ఈ కరోనా కాలంలో మరింత ''గృహహింస'' పెరిగింది. ఇటీవల ''జాతీయ ఆరోగ్య నివేదిక'' ప్రకారం మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నది అని తెలిపారు. ఆకలి కేకలు వినపడుతున్నాయి తెలిపింది. పౌష్టికాహరం, విద్య ప్రభుత్వాలు అందించాలి. విద్య వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. బడ్జెట్లో కేటాయింపులు పెరగాలి. ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, బాల్య వివాహాలు జోరు అందుకున్నాయి. మనదేశంలో మహిళలు ఎక్కువగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. శ్రమదోపిడికి గురువు తున్నారు. సమాన పనికి సమాన వేతనం లభించుట లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం''కార్మికుల కోడ్‌'' సవరణలు చేయిట ద్వారా మహిళలకు మరెన్నో సమస్యలు రాబోతున్నాయి. పని ప్రదేశాల్లో సౌకర్యాలు లేవు. కొన్ని సందర్భాల్లో అఘాయిత్యాలకు బలవుతున్నారు. కామాంధుల చేతుల్లో, అగ్రకులాల అహంకారానికి నిర్భయ, దిశ, హత్రీస్‌, ఉన్నావ్‌ వంటి ఉదాంతాలు అనేకం మన కళ్ళముందే కదలాడుతూ ఉన్నాయి. అయినా పటిష్టంగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్భయ చట్టం, దిశ యాప్‌, షీ టీం, మహిళా పోలీస్‌ స్టేషన్లు, టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఎన్ని ఉన్నా , మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ''డ్రాప్‌ ఎట్‌ హౌం'' వంటి భధ్రత చర్యలు అన్ని వేళలా అన్ని చోట్లా ఏర్పాటు చేయాలి. అఘాయిత్యాలు చేసిన వారిని త్వరితగతిన దర్యాప్తు చేసి, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలి. న్యాయ వ్యవస్థలో నారీమణులు శాతం పెరగాలి. న్యాయ వాదులుగా, న్యాయమూర్తులుగా మరెందరో రావాలి. మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. నేటికీ మన న్యాయవ్యవస్థలో 15% మహిళలే ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియంలో గానీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లోగాని ఒక మహిళ లేకపోవడం శోచినీయం...
ఈ రోజుల్లో కూడా బాలికలు /మహిళలు వస్త్రధారణ పై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక విద్యాలయంలో ''హిజాబ్‌'' ధరించి హాజరైన ముస్లిం విద్యార్థినిలను పాఠశాలలో అనుమతి నిరాకరించారు. మతం పేరుతో విద్యను దూరం చేస్తున్నారు. వివక్షత పెంచి పోషిస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం... అసభ్యకరమైన వస్త్ర ధారణ ఉంటే అందరూ ఖండించవలసిందే... కానీ ఇది వారి మత ఆచారంగా వస్తున్న వస్త్ర ధారణ. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. ఆ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా పాలన అందించాలి. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ లో మహిళలపై జరుగుతున్న అణచివేతపై ప్రపంచ దేశాలు గళం ఎత్తాలి. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలి. సిరియాలో జరుగుతున్న అమానుష సంఘటనలపై విచారణ జరిపించాలి. ముఖ్యంగా శరణార్థులుగా ఉన్న మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. ఒక్కపూట భోజనానికి తన శీలాన్ని, శరీరాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి అక్కడ గోచరిస్తుంది... ముక్తకంఠంతో ఖండించాలి. మానవహక్కుల కమిషన్‌ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి.
మన దేశంలో కూడా మహిళలు తరచూ అనేక ప్రాంతాల్లో అణిచివేతకు, అవమానాలకు మతపరంగా, కులపరంగా గురవుతున్నారు. శ్రమదోపిడి, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ''మీ టూ'' ఉద్యమం ద్వారా కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. ముఖ్యంగా మహిళలు చదువుకుని, ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాలి. నెల్సన్‌ మండేలా, , సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌, సావిత్రి బారు ఫూలే, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు వంటి వారి జీవిత చరిత్ర చదివి, తమ సమస్యలు పరిష్కారానికి తామే నాయకత్వం వహించి, ఒక రుద్రమదేవి, ఝూన్సి లక్ష్మీబాయి వలే పోరాడాలి... సుమారు మూడు దశాబ్దాల నుంచి పార్లమెంట్‌ లో పెండింగ్‌ లో ఉన్న ''మహిళా బిల్లు'' ఆమోదం పొందే విధంగా మహిళా మణులు పాలకవర్గాల పై ఒత్తిడి తేవాలి. దేశంలో సగభాగంగా ఉన్న మహిళలు అన్నింటా సమాన హక్కులు అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అవసరం అయితే పోరాటాలు ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అందుచేతనే ఈ మహిళా దినోత్సవాన్ని ''మహిళా పోరాట దినోత్సవం'' గా జరపాలి. రాజకీయ పదవుల్లో ఉన్నా చక్రం తిప్పే వారు మాత్రం వారి కుటుంబ మగమహారాజులే.... ఇది జగమెరిగిన సత్యం....ఈ వ్యత్యాసం పోవాలి. నిర్ణయాధికారం, ఆర్థిక విషయాలు అన్ని వారి కుటుంబ మగ సభ్యులే చాలా కుటుంబాల్లో నిర్వహిస్తున్నారు. స్త్రీలు స్వయం సమద్ధి సాధించాలి. చదువుతో ధైర్యంగా సాగాలి. సుప్రీంకోర్టు కూడా సైన్యం లో మహిళలకు ప్రాధాన్యత కల్పించింది. ''కమాండర్‌'' స్థాయిలో మహిళలు ఉండుటకు అవకాశం ఇచ్చింది. 2027లో మొట్టమొదటి సారిగా భారత్‌ సుప్రీం కోర్టుకు మహిళా సిజేఐ గా ( ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్‌ బి.వి.నాగరత్న బాధ్యతలు తీసుకోబోతున్నారు. శుభ పరిణామంగా భావించాలి.... ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ గా ఈ కోవిడ్‌ కాలంలో వైద్యులు, నర్సులు, పోలీసులు, ఉపాధ్యాయులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా వివిధ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సమాజానికీ అనితరసాధ్యమైన సేవలు అందించారు. 75 కోట్ల భారతీయులకు కోవిడ్‌ టీకా/ వ్యాక్సిన్‌ అందించారు. కొన్ని కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాత్రి పగలు విలువైన సేవలు అందించి, అనేకుల ప్రాణాలు కాపాడి అందరి మన్ననలు పొందారు.
ప్రస్తుతం మహిళలు అనేక సంస్థలకు సిఇఒ గా వ్యవహరిస్తున్నారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ గా కమలా హారిస్‌, న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జసిండా , తైవాన్‌ అధ్యక్షురాలు సాయింగ్‌ వెన్‌ , అనేక మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ఇందిరాగాంధీ మహిళాలోకానికి ఒక స్ఫూర్తి. కార్లా జర్కెన్‌ మహిళా ఉద్యమానికి దిక్సూచి. మలాలా యూసఫ్‌ జారు, గ్రేటా థన్బర్గ్‌ , కేరళా మాజీ ఆరోగ్య శాఖా మంత్రి శైలజా టీచర్‌, లతా మంగేష్కర్‌, శంకుంతలాదేవి , ఇటీవల రోదశీ లో ప్రయాణించిన తెలుగు అమ్మాయి బండ్ల శిరీషా వంటి వారిని, ఈనాటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రపంచంలో అనేక రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో, మన దేశ మహిళలు కూడా చదువు ద్వారా నైపుణ్యాలు పుణికిపుచ్చుకుని ధైర్యంగా ముందుకు సాగి, అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆశిద్దాం..


(మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

మానవ హక్కులు అంటే మహిళల హక్కులే
- ఐ.ప్రసాదరావు