అంతర్జాతీయ మానవ హక్కుల దినం అంటూ ఈ ఏడాది మళ్లీ ఉత్సవం జరిపేశారు. ఈ దఫా కూడా మాటలు ఘనం..చేతలు మృగ్యం తరహాలో ఒక తంతు ముగిసింది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో సరిగ్గా ఇదే రోజు పార్లమెంటు నూతన భవన సముదాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అసాంతం ప్రజాస్వామ్య ఘనకీర్తనలతో సాగింది. ఐరోపా దేశాల్లో 13వ శతాబ్దంలో వెలుగు చూసిన హక్కుల పత్రం 'మాగ్నా కార్టా'ను ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా భావిస్తాం. మన దేశంలో మాగ్నా కార్టా కంటే ముందే 12వ శతాబ్ది లోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లిందని ప్రధాని ఉటంకించారు. వెయ్యేళ్ల ప్రజాస్వామ్య ఘనమైన వారసత్వ స్ఫూర్తికి కొత్త పార్లమెంటు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి? కేంద్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచీ మోడీ సర్కార్ చేస్తున్నదేమిటి? అడుగడుగునా హక్కుల ఉల్లంఘనలే కదా! మానవ హక్కులకు దిక్కు లేని చోట ప్రజాస్వామ్య మనుగడెలా సాధ్యమో పాలకులే చెప్పాలి.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసు జులుం, స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసి జమ్ము-కాశ్మీర్‌ను కారాగారంగా మార్చడం, శాంతియుత నిరసనలు చేస్తున్న సిఎఎ, ఎన్‌ఆర్‌ఐ నిరసనకారులకు మతం రంగం పులిపి ఘర్షణలకు ఆజ్యం పోయడం ఒకటా రెండా మోడీ సర్కార్ ఏలుబడిలో హక్కుల ఉల్లంఘన జరగని రోజంటూ లేదు. దేశానికి అన్నంబెట్టే రైతన్న హక్కుల రక్షణ కోసమే కదా ఢిల్లీ వీధుల్లో గర్జన చేస్తున్నది. కార్మికులను శ్రమదోపిడి చేసి లాభాలు దండుకునే కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లు తీసుకురావడం, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాలను వంచించడం కూడా హక్కుల హననమే కదా? అర్బన్ నక్సల్స్ ముద్ర వేసి రచయిత వరవరరావు, గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి వంటివారిని వారి వృద్ధాప్య ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోకుండా కటకటాల పాల్జేసి వేధిస్తుండటం దేనికి సంకేతం? ప్రధానమంత్రి చెబుతున్న మన దేశ శతాబ్దాల ప్రజాస్వామ్య ఘన వారసత్వం ఇదేనా? ఇంతలా మానవ హక్కుల హననానికి పాల్పడుతూ ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంటుకు కొత్త భవంతులు సమకూర్చడంతోనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలిస్తామంటే నమ్మేదెవరు?
రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో హక్కుల మనుగడే ప్రశ్నార్థకమౌతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మానవ హక్కులు ఎండమావిగా మారిపోతున్నాయి. హక్కుల ఉల్లంఘన జరిగితే అండగా నిలిచే మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి)ను మన రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు. 2015-16 నుంచి హెచ్‌ఆర్‌సి ఛైర్మన్, సభ్యుల పదవులను భర్తీ చేసేందుకు కూడా పాలకులకు మనసొప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కమిషన్ పదవుల భర్తీపై నిర్లక్ష్య జాడ్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టు ఆదేశిస్తే కానీ సర్కార్ మొద్దు నిద్ర వీడలేదు. కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి కోర్టు ధిక్కరణ నుంచి ప్రభుత్వం తప్పించుకుందే కానీ పదవులను భర్తీ చేయడంలో ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే వుంది. హక్కుల రక్షణకు భరోసానిచ్చే కమిషన్ ఏర్పాటుకే దిక్కు లేకపోతే క్షేత్ర స్థాయిలో హక్కులను కాపాడే నాథుడెవరు? ప్రజా సంక్షేమ నినాదాలు వల్లించే నేతలు ఇప్పటికైనా హక్కుల రక్షణపై దృష్టి సారించాలి.
కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం పాలకులు అమల్జేస్తున్న వినాశకర విధానాలతో ప్రజానీకం హక్కులన్నీ కోల్పోయి అనునిత్యం దోపిడికి గురౌతోంది. వరుస సంక్షోభాలతో అంతర్జాతీయంగా అనేక దేశాల్లో పేదరికం పెరిగిపోతోంది. పోషకాహారం, వైద్యం వంటి కనీస జీవనావసరాలు కరువౌతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ప్రమాదం మరింత విస్తరిస్తోంది. బతుకే కష్టమైనప్పుడు పేదవాడికి ఏ హక్కూ నిలువదు. తినే తిండి, కట్టే బట్టకు పడిగాపులు కాసే దీనజీవులకు ఇక హక్కులేముంటాయి. తిండి కలిగితే కండ కలదోరు..కండ కలవాడేను మనిషోరు అని గురజాడ చెప్పింది ఇందుకేనేమో. తిండికి వెంపర్లాడే చోట మానవ హక్కులు ఎండమావే కదా. ప్రజాస్వామ్య దేవాలయాలు, ఘన వారసత్వాల గురించి గొప్పలు చెప్పే పాలకులు ముందు ప్రజల పొట్ట నిండుతోందో లేదో చెప్పాలి. కాకులను కొట్టి గద్దలకు వేసే విధానాలు నశించి ప్రజల కనీస అవసరాలు తీర్చే విధానాలు అమలు జరిగితే హక్కులు కూడా పరిఢవిల్లుతాయి. ఐతే హక్కులు దేబిరిస్తే రావని, పోరాడి సాధించుకోవాల్సిందేనని మన అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.










