ప్రజాశక్తి-గుంటూరు:మానవ హక్కులకు పత్రికా స్వేచ్ఛ చోదకశక్తి అని, దాన్ని మరింత బలోపేతం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయ వంతమౌతుందని వక్తలు అన్నారు. బుధవారం అవగాహన సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రపంచ పత్రికా దినోత్సవం కార్యక్రమంలో న్యాయవాది, విద్యావేత్త ముప్పాళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజంలో నేడు అసమానతలు, హింస, సంఘర్షణలు పెచ్చుమీరుతున్నాయని, బెదిరింపు ధోరణలు ప్రబలుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భావవ్యక్తీకరణ, మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. కోవిడ్ విజృంభించినప్పుడు ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాయని చెప్పారు. ఎపి లాయర్స్ ఫోరం కన్వీనర్ ఎ.హరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసార మాధ్యమాల నోళ్లు మూయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భారత దేశం 150వ స్థానమంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో విద్యావేత్త చంద్రయ్య, వెంకటరత్నం, మురళీకృష్ణ, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితరులు ప్రసంగించారు.










