ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : మానవ అక్రమరవాణాపై ప్రజలు అప్రమత్తతతో ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో కనిపించకుండాపోయిన తిరిగి దొరకని పిల్లల కేసులపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ. సురేష్‌తో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న సమస్యల్లో మానవ అక్రమరవాణా ఒకటని తెలిపారు. జిల్లాలో మానవ అక్రమ రవాణా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు. ఉద్యోగాలు, సినిమా అవకాశాలు, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసగించి వారిని అక్రమ రవాణా చేసే అవకాశం ఉందని, అటువంటి వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమరవాణాకు గురయ్యే మహళలను వ్యభిచారగృహాలకు, పిల్లలను బిక్షాటన ముఠాలకు, మానవ అవయవాల అక్రమ రవాణా ముఠాల బారిన పడే అవకాశం ఉందన్నారు. మహిళలు, పిల్లలను మోసగించే ముఠాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం అటువంటి కేసులు నమోదైనప్పటికీ నిరక్షరాస్యులైన ఈ ప్రాంత ప్రజలు మోసగాళ్ల బారిన పడకుండా పోలీసు అధికారులు, ప్రజలు జాగరూకతతో మెలగాలన్నారు. కార్యక్రమంలో సిఐ బిసిహెచ్ స్వామినాయుడు, ఇతర పోలీసు అదికారులు పాల్గొన్నారు.










