నందలూరు : మానవ అక్రమ రవాణా నేరమని జూనియర్ సివిల్ జడ్జి కె.లత అన్నారు. ఆదివారం ఆడపూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను, పిల్లలను కొనడం, అమ్మడం వారితో వ్యభిచారం చేయించడం నేరమన్నారు. వ్యభిచార గహం నుంచి బయటపడిన మహిళల ఎలాంటి వివక్ష చూపకూడదని, సమాజంలో మనుషుల బాధ్యత ఏమిటి అనే దానిపై వివరించారు. ఆర్టికల్ 23(1) ప్రకారం మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి నిషేధించబడిందని, అంతేకాకుండా అట్టి వాటికి పాల్పడిన వారు శిక్షార్హులని అన్నారు. పిల్లలు ఆకర్షణకు లోనై తెలియని వాళ్ళతో చాటింగ్ చేయడం, అత్యాశకులోనై సైబర్ నేరాలు ఆహ్వానిస్తూ ప్రమాదంలో పడిపోతున్నారని చెప్పారు. చదువుకోవడం ప్రతి ఒక్కరీ ప్రాథమిక హక్కని చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. టెక్నాలజీని మంచి కోసమే వాడాలని, టెక్నాలజీ అధికంగా వాడితే నేరాలు ఆహ్వానించిన వారవుతారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ మేజిస్ట్రేట్ పి.శివ శంకరయ్య, న్యాయవాదులు ఆనంద్ కుమార్, దాసరి నరసింహులు, వినరు, షమీఉల్లాఖాన్, అనుదీప్ జయసింహ, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ అనిత , కళాశాల సిబ్బంది, కోర్టు సిబ్బంది, పిఎల్‌విలు పాల్గొన్నారు.










