Jul 24,2023 19:13

మాట్లాడుతున్న చైతన్య కుమార్‌

ప్రజాశక్తి - గోనెగండ్ల
మానసిక సమస్యలతో ఇబ్బందులకు గురై జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆదోని ఏరియా ఆస్పత్రి సైకియాటిస్టు డాక్టర్‌ చైతన్యకుమార్‌ ప్రజలకు సూచించారు. సోమవారం గోనెగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామాల్లో మానసిక సమస్యలకు గురయ్యే వారిని గుర్తించడం తీసుకోవాల్సిన చర్యలపై ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆశా కార్యకర్తలకు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సుబ్బయ్య, కౌన్సిలర్‌ సోషల్‌ వర్కర్‌ సోమేష్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చైతన్యకుమార్‌ మాట్లాడారు. విధులు నిర్వహించే వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ కుటుంబ కలహాలు, మానసిక సమస్యలతో సతమతమయ్యే వారిని గుర్తించాలని, వారిని తమ దగ్గరికి తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇప్పించాలని తెలిపారు. అలాంటి సమస్యలు ఉన్న వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలి మానస కార్యక్రమంలో భాగంగా 14416 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు. తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉన్న కౌన్సెలర్‌ను గాని, సైకియాటిస్టును గాని పంపుతామన్నారు. ఆదోని ఏరియా ఆస్పత్రిలో ప్రతి సోమవారం, గురువారం నేరుగా తనను సంప్రదించి తగిన వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. డాక్టర్‌ రవళి, డాక్టర్‌ రుక్సానా, ఎంపిహెచ్‌ఈఓలు హనుమంతు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.