Oct 14,2023 22:47

మానసిక ధైర్యంతోనే క్యాన్సర్‌ నిర్మూలన : విసి

మానసిక ధైర్యంతోనే క్యాన్సర్‌ నిర్మూలన : విసి
ప్రజాశక్తి - క్యాంపస్‌ : మానసిక ధైర్యంతోనే క్యాన్సర్‌ నిర్మూలించవచ్చని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య డి భారతి పేర్కొన్నారు. వర్సిటీ స్టూడెంట్‌ అఫైర్స్‌, హెల్త్‌ సెంటర్‌, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, టాటా క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా శుక్రవారం ఇంజినీరింగ్‌ కళాశాలలోని ధతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో 'నేషనల్‌ పాలియేటివ్‌ కేర్‌ డే అండ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌'పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య భారతి మాట్లాడుతూ మానసిక ధైర్యం, కచ్చితమైన అవగాహనతో క్యాన్సర్‌ని నిర్మూలించవచ్చన్నారు. క్యాన్సర్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా టాటా క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ పనిచేస్తోందన్నారు. కేన్సర్‌ బాధితులకు నాణ్యమైన పరికరాలతో ఉచిత సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడు తోంద న్నారు. మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌ రజిని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. మనిషి జీవన శైలి, జన్యువులు, పర్యా వరణ ప్రభావం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కుటుంబ సభ్యులు క్యాన్సర్‌ రోగులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచిం చారు. టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు రవికిరణ్‌, సంధ్య మాట్లాడుతూ క్యాన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తించాల్సిన విధానాలను వివరించారు. స్టూడెంట్‌ రిలేషన్స్‌ డీన్‌ ఆచార్య కాత్యాయిని, హెల్త్‌ సెంటర్‌ అధికారి అనన్య మాట్లాడుతూ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, క్యాన్సర్‌ బారిన పడినా ధైర్యంగా ఎదుర్కొంటే సులువుగా బయటపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాభవాని, ఆంగ్ల విభాగం ఆచార్యులు వై శారద, నిర్మల, విద్యార్థినులు పాల్గొన్నారు.