Oct 10,2021 06:41

    'మా అమ్మ ఒక విషయంలో సిద్ధహస్తురాలు/ తను ప్రేమించే వాళ్లను/ ప్రేమైక లోకంలో ఓలలాడిస్తుంది/ తన మంద్రస్వరపు లాలిపాటతో/ బుజ్జిబాబులను, చిట్టితల్లులను/ గమ్మత్తుగా ఊరడిస్తుంది/ ఆ కళాత్మక ప్రావీణ్యం గురించి/ నేనేమాత్రం వివరించలేను!' అంటుంది గతేడాది సాహిత్య నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అమెరికన్‌ కవయిత్రి లూయిస్‌ గ్లక్‌. లూయిస్‌ చిన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. తరచూ చావు గురించి ఆలోచించేది. కొన్నేళ్లపాటు మానసిక చికిత్స కూడా తీసుకొంది. తన తల్లి వినిపించిన గ్రీకు పురాణ కథలు, వైయుక్తిక భావాలు, ప్రకృతి ఆరాధన వంటివి లూయిస్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆమెను మానసిక అనారోగ్యం నుంచి, చనిపోవాలన్న కోరిక నుంచి... సాహిత్యం వైపు నడిపించాయి. 'ప్యారడైజ్‌ లాస్డ్‌', 'ప్యారడైజ్‌ రీ గెయిన్డ్‌' వంటి రచనలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత కవి జాన్‌ మిల్టన్‌ అంధుడు. ఆయన అంధుడినని ఎప్పుడూ కుంగిపోలేదు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు విషయగ్రహణ లోపం వుండేదట. ఆస్తమాతో సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని ఓ యువకుడు... ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన విప్లవవీరుడు... చే గువేరా. ఇలా ఎందరో ప్రముఖులు తమ మానసిక, శారీరక అనారోగ్యాలను జయించి చరిత్రలో నిలిచిపోయారు.
      మానసిక, శారీరక వైకల్యంతో బతుకులీడుస్తున్న ఎంతోమంది మన చుట్టూ వున్నారు. ఈ వైకల్యానికి వారు ఎంత మాత్రమూ బాధ్యులు కారు. అందరూ ఉన్నా, అన్ని హక్కులూ ఉన్నా ఏమీ వినియోగించుకోలేని వారుగా, ఎవరికీ ఏమీ కానివాళ్లుగా... జీవితాంతం బతికేస్తున్నారు. వాళ్లూ మనుషులేనని... వారి పట్ల సమాజం దృష్టి మారాలని పిలుపునిస్తోంది డబ్ల్యుహెచ్‌ఓ. ఈమేరకు ఏటా అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడదు' అన్నది ఈ ఏడాది థీమ్‌. కానీ, ఆచరణలో ఈ లక్ష్యం సుదూరమే! వారినెందుకు జాలిగా చూస్తున్నారో కూడా తెలీకుండా...జనం మధ్యనే వున్నా... మిగతావారికి దూరంగా జీవిస్తున్నారు. తమకు జరుగుతున్న అవమానాలను, అసమానతలను కూడా గుర్తించే స్థితిలో వారు ఉండరు. బాలికలు, మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నా... ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోలేని స్థితి వారిది. ఆసుపత్రులు, జైళ్లు, ఇళ్లు... ఎక్కడా సరైన రక్షణ లేదు వీరికి. తమ జీవితానికి సంబంధించిన కనీస హక్కుల గురించి కూడా వారికి తెలియదు. తాజాగా లాక్‌డౌన్‌ వలన, భౌతికంగా ఒంటరితనం వలన మామూలు జనంలోని చాలామందిలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి.
     ప్రతి మనిషికీ పుట్టుకతోనే సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. ఏ కారణం చేతనూ ఒకరి హక్కులను ఎవరూ భంగపరచలేరు. అందరిలాగే సమాన గౌరవం, గుర్తింపు పొందే హక్కు మానసిక వైకల్యం ఉన్నవారికీ ఉంది. హింస, లైంగిక దాడులు, అగౌరవం, వివక్షకు గురికాకుండా, తమ జీవితాన్ని తాము స్వతంత్రంగా గడిపే హక్కు వారికి వుంది. అయితే, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఇవన్నీ అందడం లేదన్నది అందరికీ తెలిసిన నిజం. సమాజం, కుటుంబం, ప్రభుత్వం ఇలా అన్ని వైపుల నుండి వారికి అందాల్సినంత అండ దొరకడం లేదన్నదీ నిజం. మానసిక వైకల్యం కారణంగా ఎవరినీ వివక్షకు గురిచేయకూడదని ఐరాస స్పష్టంగా చెబుతోంది. వీరి రక్షణకు ఏర్పాటు చేసిన వికలాంగుల చట్టం-2016కు ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటివరకూ రూల్స్‌ రూపొందించకపోవడం దారుణం. వెంటనే రూల్స్‌ను గజిట్‌లో నోటిఫై చేసి, చట్టాన్ని అమలు చేయడం అవసరం. 'నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన/ నాలోని సాహిత్యకళ ఆగదు/ వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు/ అయినా వెలుగుతూనే ఉంటాడు/ పారే జలపాతానికి కాళ్లు లేవు/ అయినా జలజల పారుతూనే ఉంటుంది' అని ప్రకటించిన ఈ రచయిత్రి నిబ్బరం... వీరందరికీ అలవడాలి. వారి తరపున ఉద్యమించి ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరికీ వుంది. ప్రభుత్వాలు వీరి హక్కులను గుర్తించి గౌరవించాలి. అవసరమైన రక్షణ కల్పించాలి. అయితే, సమానత్వం మాత్రమే కాదు... సమాన అవకాశాలు కావాలి. ఆ అవకాశం వుంటే... వీరి నుంచి కూడా మరో లూయిస్‌, ఐన్‌స్టీన్‌లు ప్రభవిస్తారు.