Dec 14,2022 21:18

ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యకాసం ధర్నా

మాండూస్‌ తుపాను బాధితులను ఆదుకోండి

నిర్వాసితులకు అందని నగదు, నిత్యావసరాలు
రైతులకు ఎకరాకు రూ.15వేలివ్వాలని డిమాండ్‌
ప్రజాశక్తి - గూడూరు

మాండూస్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు, లోతట్టుప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయ సహకార చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం గూడూరు సిపిఎం కార్యాలయం నుండి బాధితులు ప్రదర్శనగా ముత్యాలపేట మీదుగా టవర్‌క్లాక్‌ సెంటర్‌కు చేరుకుని గూడూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట, వెంకటగిరి తదితర మండలాల్లో మాండూస్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌చేశారు. మళ్లీ నారు పోసుకునేందుకు వీలుగా విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలన్నారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా 226 కోట్లు ప్రాథమికంగా నష్టం వాటిల్లిందని అధికారులే చెబుతున్నారన్నారు. ఇంకా కొన్ని గ్రామాలు ముంపులోనే ఉన్నాయన్నారు. జిల్లా మొత్తం 500 కోట్లపైనే నష్టం వాటిల్లిందన్నారు. రైతుసంఘం నాయకులు జోగి శివకుమార్‌ మాట్లాడుతూ మాండూస్‌ తుపాను కారణంగా దివిపాలెం పంచాయతీ రైతులకు సంబంధించి 75 శాతం నారుమళ్లు ఎల్లవలో కొట్టుకుపోయాయన్నారు. మాగాణి భూముల్లో ఇసుక మేట వేసి ఉందన్నారు. ఒకో రైతుకు ఎకరాకు 15వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లోతట్టు ప్రాంతమైన ఎస్వీఆర్సీ కాలేజీ ప్రాంతంలో నివసిస్తున్న 52 కుటుంబాల వారి బట్టలు, బియ్యం, ముడిసరుకులు అన్నీ తడిచిపోయాయన్నారు. అయితే ఇంతవరకూ వారికి ప్రభుత్వ సాయం, నిత్యావసరాలు అందలేదన్నారు. అనంతరం గూడూరు ఆర్డీవో ఎఒకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పామంజి మణి, సుబ్బయ్య, జి.రాజగోపాల్‌, ఎ.శ్రీనివాసులు, బివి రమణయ్య, ఎ.ప్రసాద్‌, మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకులు బి.గోపి, కోటేశ్వరరావు, మహేంద్ర, మురళి, శాంతివర్ధన్‌ పాల్గొన్నారు.
చేనేత మగ్గం గుంటల్లో నీరు
తుపాను కారణంగా పది రోజులుగా తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లోని చెన్నూరు, విందూరు, వెంకటగిరి, బంగారుపేట, మార్లగుంట, జంగాలపల్లి గ్రామాల్లోచేనేత కార్మికులకు పనులు లేకుండా పోయాయని, మగ్గం గుంటల్లో నీరు నిలిచిపోయిందని సంఘం కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు తెలిపారు. గూడూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన అనంతరం చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. మగ్గంపైన ఉన్న పడుగు, పేక, నూలు, జరీ ఇవన్నీ పూర్తిగా చెడిపోయాయన్నారు. చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం, 20వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, గుర్రం రమణయ్య, వెంకటప్పయ్య, నరసింహులు, ఆర్‌.శ్రీనివాసులు, బాలయ్య పాల్గొన్నారు.