Nov 09,2023 21:09

బాణాసంచా షాపుల వద్ద నిబంధనలు నిల్‌
అధికారుల వసూళ్ల పరంపర
అధిక ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
దీపావళి వచ్చిందంటే అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారుల పండగలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి పేరుకు పెద్ద పండుగ అయినప్పటికీ మందుగుండు సామగ్రి వినియోగించిన వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఇదే అదునుగా చేసుకుని అధికారులు షాపుల నిర్వహణ దగ్గర పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. స్థానిక లూథరన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో సుమారు 40 మందుగుండు షాపులు ఏర్పాటు చేసినా ఆయా షాపులకు ప్రభుత్వం విధించిన నిబంధనలు మచ్చుకైనా కానరావడం లేదు. మందుగుండు సామగ్రి నిల్వల నుంచి విక్రయాల వరకూ అడుగడుగునా నిబంధనలకు నీళ్లు వదులుతూనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ధరల నియంత్రణ పట్టికల ఊసే లేదు. ఏ వస్తువు ఎంత రేటుకు అమ్మాలనేది ఇక్కడ కనిపించదు. ఈ పరిస్థితుల్లో సామాన్యుడు దీపావళి పండుగ చేసుకోవాలంటే హడలిపోతున్నాడు. బాణాసంచా ధరలను వ్యాపారులు ఏటా 20 శాతం పెంచేస్తుండడంతో సామాన్యుల జోబులకు చిల్లులు పడుతున్నాయి.
జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో బాణాసంచా హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. ఎక్కువగా విక్రయాలు జరిగే తాళ్లు, బూచక్రాలు, విష్ణు చక్రాలు, కాకరపూవ్వొత్తులు, చిచ్చుబుడ్లు వంటి సాధారణ టపాసుల ధరలు గతేడాది కన్నా ప్రస్తుతం 20 శాతం పెంచేశారు. శాశ్వత, తాత్కాలిక అనుమతులు పొందిన వారు కూడా శాఖల వారీగా మామూళ్లు ఇవ్వాల్సి వస్తుందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక లైసెన్సుల కోసమే దుకాణానికి వచ్చి, దుకాణం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి రూ.20 నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. పలు గ్రామాల్లో ఐదు నుంచి ఆరు దుకాణాలు ఏర్పాటు చేస్తుండడంతో లైసెన్సులపేరుతోనే చిరు వ్యాపారులు రూ.లక్షల ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ ఏడాది వ్యాపారం బాగుంటుందని ప్రచారం జరగడంతో కొందరు అధికారులు అధికంగా ముడుపులు డిమాండ్‌ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ దుకాణాల ఏర్పాటు కోసం మామూళ్ల రూపంలో రూ.లక్షల్లో వసూలు చేశారనే విమర్శలు వనిపిస్తున్నాయి. షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇటీవల సమావేశపర్చారు. ఎంత మంది విక్రయాలు చేయాలనుకుంటున్నారో, దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలంటూ సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో వారంతా భారీస్థాయిలో ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇతరత్రా శాఖలతో తమకు సంబంధం లేదని, తమకు ఇవ్వాల్సినంత కచ్చితంగా ఇవ్వాలని అంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మందుగుండు సామగ్రి తీసుకురావడానికి వ్యాపారులు రెండు రకాల పన్నులు చెల్లించాలి. హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీ తదితర శాఖల అనుమతులు తీసుకోవాలి. దీనికి లైసెన్స్‌ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా. అనధికారిక ముడుపులతో తమకు వ్యాపారం జరగకపోతే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. పట్టణాలు, మున్సిపాల్టీల పరిధిలో భారీస్థాయిలో మందుగుండు సామగ్రి విక్రయాలు జరుగుతాయి. జిల్లా కేంద్రంలో, ఇతర ముఖ్య పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులంతా ఈ ఏడాది కేవలం ముడుపుల కోసం ఒక్కో చోటే రూ.10 నుంచి రూ.15 లక్షల వరకూ కేటాయించినట్లు సమాచారం. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లోనే దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.