Dec 21,2022 23:54

అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన శాఖ సంయుక్తంగా డొంకాడ, రేబాక గ్రామాలలో ప్రస్తుతం మామిడి తోటలలో తీసు కోవలసిన యాజ మాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి మామిడి తోటలను సందర్శించారు. మామిడి తోటలలో తామర పురుగుల నివారణకు ఏసిఫేటే ఒక గ్రాము లేదా ఫిప్రోనిల్‌ రెండు గ్రాముల లీటర్‌ నీటి కలిపి పిచికారి చేసుకోవాని ఉద్యాన శాస్త్రవేత్త రామడుగు ప్రవీణ్‌ రైతులకు సూచించారు. పిందె దశలో ఆశించే కాయతోలుచు పురుగు నివారణకు సామూహికంగా పొలంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎండిపోయిన కొమ్మలతో మంటలు వేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో చేపట్టవలసిన వివిధ రకాలైన యాజమాన్య పద్ధతులపై సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్ర ప్రసాద్‌ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి ఉమామహేశ్వరి, పలు రైతులు పాల్గొన్నారు.