ప్రజాశక్తి - నూజివీడు రూరల్
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, మామిడి పంటకు బీమా వర్తింపజేసి పరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా నాయకులు కోరారు. మంగళవారం మండలంలోని యనమదల గ్రామంలో నష్టపోయిన మామిడి తోటలను వారు పరిశీలించారు. మామిడి పంటకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మగడ్డ నర్సింహా, కె.శ్రీనివాస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రాజు మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న మామిడికి గత మూడు సంవత్సరాల నుండి వాతావరణ పరిస్థితుల వల్ల తేనె మంచు, తెగుళ్ల వల్ల దిగుబడి రాక పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు వరకు పెట్టి నష్టపోతున్నారన్నారు. ఐనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిహారమూ, బీమా వర్తింపజేయకపోవడం అన్యాయమని అన్నారు. మామిడి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మామిడి రైతులు పాల్గొన్నారు.










