
ప్రజాశక్తి- చోడవరం
మామిడి రైతులు, తోటలు కొనుక్కున్నవారు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. పండ్లు అమ్ముడుపోక రోడ్లు వెంబడి గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగల్లు వానలతో అపార నష్టాన్ని చెవి చూసిన వీరికి, మిగిలి ఉన్న పండ్లు అనుముకుందామన్న పైసలు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో మామిడి పండ్లు దొరికితే చాలు ఎంత ధర కైనా కొనుక్కునే వినియోగదారులు ప్రస్తుతం చౌకగా లభిస్తున్నా వాటిని చూసి కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మామిడి తోటలు సాగు చేసే రైతులు, వేలాది రూపాయలు వెచ్చించి తోటలు కొనుక్కున్న వారు దిక్కుతోచని పరిస్థితిల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
చోడవరం, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో అనేక చోట్ల మామిడి తోటలు విరివిగా వేశారు. ఈ ఏడాది ఈ మామిడి తోటల్లో కాయలు విరివిగా కాశాయి. చోడవరం మండలంలో అడ్డూరు తదితర ప్రాంతాల్లో మార్కెట్లో బాగా అమ్ముడుకుపోయే రకాలను సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో బంగినపల్లి, సువర్ణ రేఖ, చెరుకు రసాలు వంటివి మార్కెట్లో ఎక్కువగా వినియోగదారులు కొనుక్కుంటారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్లు కారు చౌకగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
గతంలో తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుండి కోల్‌కతా, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు మామిడి పండ్లు అధికంగా ఎగుమతి అయ్యేవి. దీంతో మామిడి పండ్లు వ్యాపారులు తోటలు కొనుగోలు చేసి మామిడి పండ్లును ఎగుమతి చేసేవారు. కాని ఇటీవల కాలంలో ఆయా ప్రాంతాలకు ఎగుమతులు తగ్గాయి. తోటలకు చీడపీడలు ఆశించి కాయ నాణ్యత తగ్గడం, మచ్చలు ఏర్పడ్డం, వడగల్లువానల వల్ల కాయ దెబ్బతినడం వంటి కారణంగా ఆ రాష్ట్రాలకు మామిడి పండ్లు రవాణా తగ్గిపోయింది. దీనికి తోటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాని తూర్పుగోదావరి జిల్లాల నుండి మామిడి పండ్లు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. దీంతో ఇక్కడ కారు చౌకగా అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు పక్వానికి రాకుండా కాయలు కోసి రసాయనాలు పోసి మగ్గబెట్డడంతో పండ్ల రుచి తగ్గుతూ ఉండడంతో వినియోగదారుల పండ్లు కొనుగోలు చేయకపోవడానికి కారణంగా తెలుస్తుంది. గతంలో వయసుతో నిమిత్తం లేకుండా మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ ఎంత ఇష్టంగా తినేవారు. రాను రాను షుగరు, బీపీ వంటి వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా వస్తుండడంతో వీటి బారిన పడినవారు మామిడి పండు జోలికి వెళ్లడం లేదు. అమ్మకాలు తగ్గుదలకు ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది.
ఈ ఏడాది ధరలు తగ్గిపోవడంతో చెట్లనుండి కాయలు దించిన కూలి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల కాయలు దించకుండా చెట్లకు వదిలేశారు. 100 పండ్లు ఉండే బుట్ట గతంలో రూ.700 నుండి రూ.800 వరకు మేలు రకం పండ్లు ధర పలికేది. ప్రస్తుతం చోడవరం మార్కెట్లో బుట్ట ధర రూ.300 నుండి రూ.400కు మించి అమ్ముడుపోవడం లేదు. అదికూడా అరకొరగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు తగ్గడంతో వ్యాపారులు తోటల వద్ద పంట కొనుగోలు చేయడం మానేశారు. దీంతో రైతులే నేరుగా రోడ్లు పక్కన దుకాణాలను పెట్టి తమ పండ్లును అమ్మకాలు చేపడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మండు ఎండలో కూర్చున్న సకం పండ్లు కూడా అమ్ములు పోలేదని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడి తోటలు తీసివేయడం తప్ప మరొక గత్యంతరం లేదని రైతులు వాపోతున్నారు.