Nov 02,2023 22:26

ప్రజాశక్తి - చిత్తూరు
జిల్లాలో ప్రధాన పంట అయిన మామిడిలో ఖర్చులు తగ్గించుకుని, నాణ్యమైన పంటను పొందేలా, ఎగుమతులను ప్రోత్సహించేలా శాస్త్రవేత్తలు, అధికారులు తగు సూచనలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ పి.రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఉద్యానవన శాఖ కార్యాలయంలో రానున్న కాలంలో మామిడిలో తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో ఉద్యానవన శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనలు, అధికారుల సలహాలను రైతులు పాటించాలన్నారు. నాణ్యమైన టేబుల్‌ వెరైటీస్‌ ఉత్పత్తయితే ఇతర దేశాల్లో మంచి ధరలు ఉన్నాయన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 58వేల హెక్టార్లలో మామిడి సాగు అవుతుందని, ఒక్కో హెక్టారుకు పది టన్నులు ఉత్పత్తి అవుతుందని, తద్వారా దాదాపు ఆరు లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి ఉంటుందని, తోతాపురి రకం పల్ప్‌ చేసేందుకు 31 పరిశ్రమలు ఉన్నాయన్నారు. టేబుల్‌ వెరైటీస్‌లో నాణ్యత పాటిస్తే రైతుకు మంచి ధర వస్తుందన్నారు. క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి, సేంద్రీయ ఎరువులు ఉపయోగించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మామిడిలో వస్తున్న సమస్యల గురించి కూలంకుషంగా చర్చించారు. సీనియర్‌ శాస్త్రవేత్త నాగరాజు మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత లోపించిందని, గాలిలో తేమ శాతం తగ్గడం ద్వారా పురుగులు ప్రధానంగా కీడు చేసే పురుగులు భారీ ఎత్తున పెరగడం, పంటలను నష్టపరచడం జరుగుతుందన్నారు. మామిడి తోటల్లో ఎక్కువ రకాల చెట్లు ఉండటం వల్ల ఆయా చెట్ల కాలపరిమితి వేర్వేరుగా ఉండటం వల్ల, తోటలలో కత్తిరింపు చేసేటపుడు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల పురుగులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వీటిని అదుపు చేసేందుకు మందులు కొట్టడం జరుగుతుందని, తద్వారా నాణ్యత లోపిస్తుందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తే టేబుల్‌ వెరైటీస్‌కు ఎగుమతి వీలుగా ఉంటుందని, యంత్ర సామాగ్రిని మరింత విస్తృతంగా సరఫరా చేసి ఖర్చులు తగ్గించేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించాలని ఉద్యానవన యూనివర్సిటీ మాజీ వైస్‌ఛాన్సలర్‌ బిఎన్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ అవార్డు గ్రహీత కట్టమంచి బాలకష్ణారెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఉద్యానవన అధికారి రవిచంద్రబాబు, శాస్త్రవేత్తలు శ్రీనివాసులు రెడ్డి, సందీప్‌ నాయక్‌, రైతులు వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, గోవర్ధన్‌ బాబి, తలపులపల్లి బాబు రెడ్డి, శివకుమార్‌, ఆనంద నాయుడు తదితరులు పాల్గొన్నారు.