మామ, భర్త అడుగుజాడల్లోనే : చల్లా శ్రీలక్ష్మి
ప్రజాశక్తి - అవుకు
'మా మామ దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, నా భర్త దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తా' అని జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం అవుకు పట్టణంలో వైసిపి నూతన కార్యాలయాన్ని ఇద్దరు కుమారులు చల్లా రాజ్యాభిషేక్ రెడ్డి, చల్లా జూనియర్ రామకృష్ణారెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తన మామ చల్లా రామకృష్ణారెడ్డి, భర్త చల్లా భగీరథరెడ్డిలు తమ మధ్య లేకపోయినా వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే ధ్యేయమని అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలకు పార్టీ కార్యాలయంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ నాయకులు, పత్రిక యాజమాన్యాలు, పార్టీ రాష్ట్ర క్యాడర్‌లోని ముఖ్య నాయకులు తనకు మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పడంతో రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ ప్రజలతో కలిసి వారి సమస్యలను పరిష్కరించడమే తన వంతు బాధ్యతగా పని చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలిచి తనకు ధైర్యాన్ని కల్పిస్తున్న చల్లా విక్రాంత్ రెడ్డి, చల్లా సాయి చరణ్ రెడ్డి, చల్లా సాయి చైతన్య రెడ్డి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వైసిపి అభిమానులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి పెట్టారు.










