
'మీరెన్ని సాకులు చెప్పినా సరే మీరు డ్యూటీకి రావాల్సిందే. ఇది తప్పనిసరి. మీరిలా తప్పించుకుంటారనుకోలేదు. ఈ సిటీకి మొత్తం మీరే గొప్ప పల్మనాలజిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ కరోనా సమయంలో మీలాంటి చెస్ట్ స్పెషలిస్ట్‌ల అవసరమెంతో నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పైగా డియం అండ్ హెచ్వో, హెల్త్ సెక్రటరీ మీ గురించి అడుగుతున్నారు' అని మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ వీర్రాజు ఒత్తిడి చేస్తుంటే, ఏం చెప్పాలో పాలుపోలేదు డాక్టర్ ధనంజయకు.'చెప్పాను కదా సార్? నాకు అస్సలు ఒంట్లో బాగోలేదని. మందులు వేసుకున్నా తగ్గడం లేదు. ఇదిగో మళ్ళీ బాత్‌రూంకి వెళ్ళాల్సి వస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను' అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆలోచనలోపడ్డాడు.
అతను సిటీలోని అతి పెద్ద గవర్నమెంట్ హాస్పటల్లో పనిచేస్తున్నాడు. చెస్ట్ స్పెషలిస్ట్‌గా అతనికి చాలా మంచి పేరుంది. అత్యాశపరుడనే పేరూ ఉంది. అతను చేసే ప్రతి పనికీ డబ్బు లింకై ఉంటుంది. అతనికున్న ప్రతిభకి చాలా ఎక్కువ డబ్బు ఇస్తామని చాలా కార్పొరేట్ హాస్పటల్స్ ఆఫర్ చేసినా అతను అంగీకరించలేదు. గవర్నమెంట్ హాస్పటల్లో పని తక్కువ. పెద్దగా స్ట్రెస్ ఉండదు. ప్రైవేట్ ప్రాక్టీస్ వల్ల బాగా గడిస్తున్నాడు. అతనికి ధీటైన డాక్టర్లు కార్పొరేట్ హాస్పటల్లోనూ లేకపోవడంతో చాలామంది అతని క్లినిక్‌కి వస్తూంటారు. వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయినవ్వమని చెప్పి, వాళ్లకు స్పెషల్ రూములు, ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యతా తనే తీసుకుంటాడు. ఇలా అతనికి చాలా డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది.
ఇప్పుడతనికి రెండువారాలు వరుసగా డ్యూటీ పడింది. కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలందించడానికి, అందరిలాగే డ్యూటినీ ఎలా ఎగ్గొట్టాలో అతనికి తెలియడంలేదు. దానివల్ల ప్రాణాలకే ప్రమాదం. పైగా అంతా ఫ్రీయే. పైసా అదనపు ఆదాయం ఉండదు. పనీ ఎక్కువ. అందుకే అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. 'గురువుగారే ఏదో మార్గం చెప్తారు' అనుకుంటూ, వైజాగ్‌లో ఉన్న డాక్టర్ శేషగిరికి ఫోన్ చేసి, పరిస్థితి వివరించాడు.
ధనంజయ ఉద్యోగంలో చేరిన కొత్తలో అతని సీనియర్ డాక్టరే శేషగిరి. ధనంజయను పాడు చేసింది శేషగిరే. చాలా తెలివైనవాడని అతనంటే శేషగిరికి చాలా ఇష్టం. తన కూతురు శ్రావణిని అతనికిచ్చి పెళ్లి చేద్దామని, ధనంజయ పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకోవడమే కాకుండా, ప్రత్యేక శ్రద్ధతో అతన్ని గొప్ప డాక్టర్‌గా తీర్చిదిద్దాడు. దానికి తోడు, డబ్బు ఎలా సంపాదించాలో బాగా నేర్పాడు. కానీ అతని కోర్కె తీరలేదు. కూతురు ఎవర్నో ప్రేమించి, తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకుంది. శేషగిరితో పాటు, ఆమెను పెళ్ళాడాలన్న కోరికతో ఉన్న ధనంజయ కూడా కుంగిపోయాడు. అందగాడు, ధనవంతుడు, పెద్ద పేరున్న డాక్టర్ అయిన తనని కాదని, ప్రజాసేవే ధ్యేయంగా ఒక సేవా సంస్థ నడుపుతున్న సాధారణ వ్యక్తి కుమార్‌ని చేసుకోవడంలో శ్రావణి ఆంతర్యమేమిటో ధనంజయకు ఇప్పటికీ అర్థం కాదు.
అనుకున్నట్లే శేషగిరి చక్కని తరుణోపాయాన్ని సూచించాడు. పెద్ద దిగులు తీరినట్లు ఫీలయ్యాడు ధనంజయ. మళ్ళీ సూపరిండెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ధనంజయ నిరాకరించడంతో సూపరిండెంట్ గొంతులో తీవ్రత పెరిగింది. 'నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఉద్యోగానికే ప్రమాదం' అంటూ బెదిరించాడు. అది ముందుగానే ఊహించిన ధనంజయ తాపీగా 'మీకు నచ్చినట్లు చేసుకోండి. నాకు బయట ఎంత డిమాండ్ ఉందో మీకు తెలియంది కాదు. నాకీ ఉద్యోగం ఒక లెక్కకాదు' అని ఫోన్ కట్ చేశాడు. ఆ సమాధానం ఊహించని డాక్టర్ వీర్రాజు ఖంగుతిన్నాడు. 'నిజమే ...అతనికి అంత డిమాండు ఉంది. నేనే తొందరపడ్డానా? సరే ఈసారికి వదిలేద్దాం.. మళ్ళీ ప్రయత్నిద్దాం' అనుకున్నాడు. కానీ అంత అనుభవమున్న డాక్టర్ ధనంజయ సేవలు ప్రజలకు అందకపోవడం అతన్ని ఆవేదనకు గురిచేసింది.
మర్నాడు హాస్పటల్‌లోకి అడుగు పెడుతున్న డాక్టర్ వీర్రాజు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మాట, పలుకు లేక బొమ్మలా నిలబడిపోయాడు. డ్యూటీలో చేరి, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ తీసుకుంటూ తనని విష్ చేస్తున్న ధనంజయను చూసి, 'ఇది కలా? నిజమా?' అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. 'ఏమిటీ మార్పు? నిన్న నేను బెదిరించడం వల్లనే, అతను డ్యూటీలో చేరాడా?' అనుకున్నాడు మొదట. 'అదికాదు. బలమైన కారణమేదో ఉండి ఉంటుంది. ఏమిటది?' అని ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా, అతనికేమీ తట్టలేదు.
నిజమే దానికి బలమైన కారణమే ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ఒకరోజు వెనక్కి వెళ్ళాలి. ముందురోజు.. 'సూపరిండెంట్ ఇక తన జోలికి రాడు' అనుకుంటూ ఉత్సాహపడుతున్న ధనంజయకు సడన్‌గా మాలతి గుర్తు రావడంతో అతని మూడ్ అంతా మారిపోయింది. గుండె అంతా విషాదంతో నిండిపోయింది. మాలతి మరణం తన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చిన విషయం గుర్తొచ్చి, మనసంతా చేదుగా అయిపోయింది.
మాలతి తల్లి, కమల తానున్న అపార్ట్మెంట్లో తన ఇంటితో పాటూ, మరో మూడిళ్ళలో పనిచేస్తున్నా, మొత్తం అపార్ట్మెంట్ అంతా ఆమె సేవలు అందరికీ ఏదోరకంగా అందుతూ ఉంటాయి. ఎవరికి ఏ సాయం కావాలన్నా, ఆమె గానీ, ఆమె కూతురు మాలతి గానీ ముందుంటారు. అందుకే వాళ్ళంటే అందరికీ ఇష్టం. ప్రతిదాన్నీ డబ్బుతో కొలిచే ధనంజయ అంటే, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారెవరికీ పెద్దగా ఇష్టం ఉండదు. అతనితో ఎప్పుడూ అవసరం పడకూడదని, ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. ఎదురుపడినా ఎవరూ అతన్ని ఆత్మీయంగా పలకరించరు. ఆ విషయం అతనికీ తెలుసు. 'వీళ్లెవరికీ నా అవసరం పడదా? అప్పుడు చెప్తాను' అని కసిగా అనుకుంటూ ఉంటాడితను.
ధనంజయ భార్య రేవతి, అతనికి పూర్తిగా వ్యతిరేకం. 'వైద్యో నారాయణో హరి' అన్న మాటపై అత్యంత విశ్వాసంతో డాక్టర్‌నే పెళ్లి చేసుకోవాలని కలలు కంది. పెళ్ళయిన తర్వాత భర్త నైజం తెలుసుకొని, చాలా నిరాశపడింది. అయినా భర్తలో మార్పు తేవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండేది. ఎప్పటికైనా భర్త మారతాడన్న ప్రగాఢ విశ్వాసంతో ఉన్న రేవతి ఆశలు మాలతి మరణంతో అడుగంటాయి. మాలతి 'న్యుమోనియా' వ్యాధితో గవర్నమెంట్ హాస్పటల్‌లో జాయిన్ అయిన వారం రోజులకే చనిపోయింది. ఏదో వైద్యం చేస్తున్నట్లు ధనంజయ నాటకమాడాడని, డబ్బొచ్చే కేసు కాదు కాబట్టి, నిర్లక్ష్యం చేశాడని, అందుకే మాలతి చనిపోయిందని అందరికీ తెలిసిపోయింది. ఆ సంఘటనతో రేవతి మనసు విరిగిపోయింది. ధనంజయ ఎంత బతిమాలినా వినకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. అత్తమామలు, తన తల్లిదండ్రులు రేవతిని వెనక్కి పంపడానికి ఏ ప్రయత్నమూ చేయకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. విపరీతమైన కోపంతో కుత కుతలాడిపోయాడు. ఏనాటికికైనా రేవతి తిరిగి వస్తుందనే ఆశతో ఉన్న ధనంజయకు మరో దెబ్బ తగిలింది. తన కాళ్ళ మీద తాను నిలబడడానికి మంచి ఉద్యోగం వెతుక్కొని, విడాకుల నోటీస్ పంపింది రేవతి. అప్పటి నుంచి అతను నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు. అతనిలో ఆత్మవిమర్శ మొదలైంది. చాలారోజుల తర్వాత అతనిలో మార్పు రావడం ప్రారంభమైంది. ఒంటరి బతుకు చాలా బాధాకరంగా అనిపించింది. ప్రాణ భయంతో డ్యూటీ ఎగ్గొట్టడం అతనికి హాస్యాస్పదం అనిపించింది. 'బతికుండి ఎవరిని ఉద్ధరించాలి?' అన్న ధోరణి వచ్చింది. ఈ ఆలోచనలన్నీ అతన్ని మంచి మార్గంలోకి మళ్ళించడానికి ఉపయోగపడ్డాయి. అందుకే తన మనసు మార్చుకున్నాడు. రేవతి నమ్మిన 'వైద్యో నారాయణో హరి' అన్న సూక్తి నిజం చేయడానికి తన వంతు ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు.
రెండువారాల తర్వాత..... 'అందరూ ఆశ్చర్యపోవడమే, ఇది ఖచ్చితంగా ప్రపంచంలో ఎనిమిదో వింతే!' అనుకుంటూ. ధనంజయ రోజుకు పదహారు గంటలకుపైనే నిర్విరామంగా పనిచేస్తున్నాడు. మరో రెండు వారాల పాటూ పని చేయడానికి స్వచ్ఛందంగా తానే ముందుకొచ్చాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఎంతో మందికి ఆరాధ్య దైవమయ్యాడు. నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఎందరో జీవించారు. ఆ రెండు వారాల్లో అతనికి లభించిన తృప్తి మునుపెన్నడూ కలగలేదన్న విషయాన్ని గుర్తించాడు. ఆ భావన రాగానే అతని మనసు అలౌకికమైన ఆనందాన్ని పొందింది. బీడు వారిన జీవితంలో వసంతం చిగురించినట్లు సంతోషపడ్డాడు. 'నిజమైన ఆనందం డబ్బులో లేదు. సేవ చేయడంలోనే ఉంది' అన్న రేవతి ఎన్నోసార్లు చెప్పిన మాటల్లో అర్థం స్వానుభవంతోనే తెలిసింది అనుకున్నాడు.
నెల రోజుల సేవ పూర్తి చేసి, నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని, మళ్ళీ డ్యూటీకి వస్తానని చెప్పి, ఇంటికి బయల్దేరాడు ధనుంజయ. వేరేదారి లేక ఇంటికి వెళ్తున్నాడుగానీ, అతనికి ఇంటికి వెళ్ళడం ఏమాత్రమూ ఇష్టం లేదు. కారు అపార్ట్మెంట్ ఆవరణలోనికి పోనీయగానే, పార్కింగ్ లాట్‌కి అడ్డుగా చాలామంది నిలబడి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూ, కారు దిగాడు. ఒక్కసారిగా అతని మీద పూల వర్షం కురిసింది. వెంటనే పైకి చూశాడు. పై అంతస్తుల్లో ఉన్నవారు, గొప్ప ఆనందంతో అతని మీదకు పూలు జల్లుతున్నారు. చప్పట్లతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లిపోయింది. 'ఇన్నాళ్ళూ అసహ్యించుకున్న జనం, తనని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు' అని గ్రహించగానే, అతని మనసెంతో ఉద్వేగానికి గురైంది. అప్రయత్నంగా కన్నీళ్లు జల జలా రాలాయి. కన్నీళ్లతో అంతా మసక బారిపోవడంతో అక్కడున్న జనంలో రేవతి, ఆమె తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు, బంధువులు స్నేహితులూ ఉన్నట్లు గుర్తించడం కాస్త ఆలస్యమైంది. అందరూ అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకోవాలనే కోరికను బలంగా అణుచుకొని, అతని రాక కోసం చూస్తూ ఉండిపోయారు. కళ్ళు తుడుచుకున్నాక, తన వారిని అందరినీ చూసిన ధనంజయ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.
కొయిలాడ రామ్మోహన్‌రావు
9849345060