May 31,2023 19:27

అభివాదం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
మాలల విద్యాభివృద్ధితోనే చైతన్యం కాగలరని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షులు నరసింహం తెలిపారు. బుధవారం ఆలూరు వాసవీ కల్యాణ మండపం ఆవరణలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది అధ్యక్షతన మాల మహానాడు సింహగర్జన మహాసభ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు చలవారి మహాసభ బళ్లారి జిల్లా అధ్యక్షులు నర్సప్ప, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మనువడు రాధాకృష్ణ, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది త్యాగరాజు, మాలమహానాడు అనంతపురం అధ్యక్షులు పుష్ప మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది మాలల జనాభా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు ఉన్నారని చెప్పారు. ఆలూరు తాలూకాలో 24 వేల ఓటర్లు ఉన్నా వివిధ రాజకీయ పార్టీలు మాలలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాలలను గుర్తించి రాజకీయంగా ఎదిగేందుకు ఐక్యం కావాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇస్తే కర్నూలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయడానికి దామోదరం సంజీవయ్య మనువడు రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గేయ, రచయిత రంగస్వామి పాడిన సిడిని నాయకులతో ప్రారంభించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది మాట్లాడుతూ... తాలూకాలో దళితులపై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. మాలలు చైతన్యమయి హక్కులను కాపాడుకుంటూ సమస్యలపై పోరాడి సాధించుకోవాలన్నారు. ఎంపిపి రంగమ్మ, వైసిపి నాయకులు లుమాంబ, కమ్మరిచేడు వీరేష్‌, మొలగవల్లి నాగరాజు, వన్నూరప్ప, గోపాల్‌, భరత్‌, మల్లయ్య, వీరభద్ర, వెంకటేష్‌, రామాంజి, ఈరన్న పాల్గొన్నారు.