Feb 17,2023 00:08

మాట్లాడుతున్న శిరీష రాణిగ్రా

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గునుపూడి,చ బంగారమ్మపేట రెవిన్యూ సరిహద్దులపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి గునుపూడి సచివాలయంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గునుపూడి రెవెన్యూ పంచాయతీ కావడంతో భూములపై వచ్చే ఆదాయమంతా గునుపూడి పంచాయతీకే వస్తుందని, సరిహద్దు గ్రామమైన బంగారమ్మపేటకు రెవెన్యూకు ఆదాయం రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, బంగారమ్మపేటకు సర్వే నెంబర్లు కేటాయించాలని కోరుతూ ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసారు. ఈ మేరకు శిరీషారాణి ఇరు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్‌ గోసల నరసమ్మ, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, బంగారమ్మపేటకు ఆదాయం వచ్చేలా సరిహద్దులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు రెవిన్యూ అధికారులు సర్వే చేపట్టి నివేదికను అందజేయాలని శిరీషా రాణి సూచించారు. అనంతరం సంపద తయారీ కేంద్ర నిర్మాణ స్థలాన్ని పరిశీలించి వెంటనే షెడ్డు నిర్మాణం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఓ మూర్తి, గునుపూడి సర్పంచ్‌ అయినంపూడి చిన పేర్రాజు, ఎంపీడీవో సీతారామరాజు, పిఓపిఆర్డి వెంకటనారాయణ, ఆర్‌ఐ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, సర్వేయర్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.