Nov 10,2023 21:44

మందుగుండు సామగ్రి దుకాణాదారులతో కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ బేరసారాలు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

           వ్యాపారుల లావాదేవీల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును వసూలు చేయాల్సిన కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్స్‌ దీపావళి మందు గుండు సామగ్రి అమ్మకాల్లో మాకెంత ఇస్తారని బేరసారాలు ఆడటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్లలో జరిగే వ్యాపార లావాదేవీల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పలువురు వాపోతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా స్థానిక లూథరన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో సుమారు 40 వరకు మందు గుండు సామగ్రి దుకాణాలు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
దుకాణాల వద్ద కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ బేరసరాలు
మందుగుండు సామగ్రి దుకాణాల వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ట్యాక్స్‌ వసూలు చేయాలి. కాని భీమవరం కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీస్‌లో పనిచేసే ఒక అధికారి నూతన హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఉన్న ఒక షాపు యజమాని వద్దకు వెళ్లి రూ.మూడు వేలు, మందు గుండు సామగ్రి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. షాపు యజమాని తమ సిండికేట్‌లో ఐదు షాపులు ఉన్నాయని, దుకాణానికి రూ.రెండు వేలు ఇచ్చుకోగలమని చెప్పడంతో బేరం కుదుర్చుకుని వారికి కావాల్సిన మందు గుండు సామగ్రిని అట్ట బాక్సుల్లో ప్రత్యేకంగా ప్యాక్‌ చేయించుకుని తీసుకెళ్లారు. ఇదంతా చూసిన కొనుగోలుదారులు అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఇలా చేయటం ఏంటని విమర్శిస్తున్నారు.