వైసిపి నేతల వేధింపులే కారణం!
ప్రజాశక్తి - నూజివీడు
టిడిపికి చెందిన మాజీ సర్పంచి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని బత్తులవారిగూడెంలో కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి భూక్య శ్రీనివాసు నాయక్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమీపంలోని వారు 108 అంబులెన్స్‌లో బాధితుడిని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ బత్తులవారిగూడెం గ్రామంలో వైసిపి నేత మందాడి శంకరం తనను అనేక విధాలుగా వేధిస్తున్నారని, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఎప్పుడైనా తనను చంపేస్తానని శంకరం బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సిఐ ఆర్.అంకబాబు నూజివీడు ఏరియా ఆసుపత్రికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. శ్రీనివాస్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అంకబాబు తెలిపారు.










