ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని కల్లేరు మాజీ సర్పంచ్, సిపిఎం కార్యకర్త కామ్రేడ్ సోమమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సోమమ్మ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమమ్మ భౌతిక కాయాన్ని సిపిఎం నాయకులు సందర్శించిన జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ పట్ల అంచలంచల విశ్వాసం కలిగిన ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ సోమన్న అని కొనియాడారు. సోమమ్మ రెండుసార్లు కల్లేరు సర్పంచ్‌గా ఎన్నికై ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. సోమమ్మ నిలువెత్తు ఆదివాసీ సాంప్రదాయ దుస్తులతో ఎప్పుడూ నిండుగా హుందాగా ఉండేవారని తెలిపారు. పార్టీ కార్యకర్తగా ప్రజా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారన్నారు. మండల పరిషత్ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను నిలదీసేవారని చెప్పారు. సోమమ్మ కూతురు జానకమ్మ అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. సోమమ్మ చెల్లి చనిపోవడంతో ఆమె కూతురైన లక్ష్మిని పెంచి పెద్ద చేసి వివాహం చేసినట్లు చెప్పారు. ఇద్దరు కూతుర్లు సమక్షంలో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సీసం సురేష్, పల్లపు వెంకట్, గుర్రం రంగమ్మ, పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, కల్లేరు పంచాయతీ నాయకులు కారం శ్రీరాములు, సోడే రెడ్డి, రాఘవయ్య, బంధువులు, ప్రజలు పాల్గొన్నారు.










