మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
- పట్టణంలో ఉద్రిక్త వాతావరణం
- పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- 14 రోజులు రిమాండ్
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ /నంద్యాల లీగల్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను బుధవారం ఉదయం నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి నాయకులు ఏవి సుబ్బారెడ్డిపై మంగళవారం రాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అఖిలప్రియను, ఇతరులను అరెస్టు చేసేందుకు బుధవారం నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బందితో భూమా అఖిల ప్రియ స్వగృహానికి వచ్చారు. పోలీసులు ఇంటిలోకి ప్రవేశించి మొదట కొంతమంది అనుచరులను అదుపులో తీసుకున్నారు. తమ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో కొంతమంది టిడిపి నేతలు భూమా నివాసానికి వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా దంపతులను అరెస్టు చేసే సమయంలో కొంత వాగ్వివాదం జరిగినట్టు సమాచారం. తనపై సైతం దాడి జరిగినట్లు, ఈ ఘటనలో తాను కూడా బాధితురాలేనని అఖిలప్రియ పోలీసులతో అన్నట్టు తెలుస్తుంది. చివరకు తన కుమారుడిని తీసుకొని తన భర్త భార్గవరామ్‌తో కలిసి పోలీసుల వాహనాలు వెంట రాగా సొంత వాహనంలోనే వెళ్లారు. నంద్యాలలో అయితే శాంతిభద్రతల సమస్య ఉంటుందేమోనన్న ఆలోచనతో ఆమెను పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూమా అఖిలప్రియ ఆరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్య పరీక్షల నిమిత్తం నంద్యాల సర్వజన వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నంద్యాల కోర్టులో ప్రవేశపెట్టారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్
నంద్యాల లీగల్ : తెలుగుదేశం నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్ ఇచ్చినట్టు నంద్యాల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆదినారాయణ తెలిపారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో నంద్యాల తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నెంబర్ 98/2023గా సెక్షన్లు 324, 307, 120b, ఆర్‌డబ్ల్యు 34 ఐపిసిగా నమోదైన కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు, సాయి, మోహన్‌లను కర్నూలు జిల్లా జైలుకు 14 రోజుల రిమాండ్‌కు పంపినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. భూమా అఖిలప్రియ తరఫున తాతిరెడ్డి తులసిరెడ్డి, ఆళ్లగడ్డ శివరామిరెడ్డి, ప్రాస్‌క్యూస్షన్ తరపున పబ్లిక్ ప్రాస్‌క్యూటరు వాదనలు వినిపించారు. ఈ వాదనలు దాదాపు గంట సేపు జరిగాయి. వాదనల అనంతరం మేజిస్ట్రేట్ కర్నూలు జిల్లా జైలుకు పంపించారు.










