May 17,2023 10:49

పాణ్యం పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి

ఆళ్లగడ్డ నుండి పాణ్యం పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ :
నారా లోకేష్‌ యువ గళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన అనంతరం తెలుగుదేశం సీనియర్‌ నాయకులు, భూమానాగిరెడ్డి అనుచరుడు ఎవి.సుబ్బారెడ్డిపై మంగళవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో బుధవారం మాజీమంత్రి అఖిలప్రియను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో ఉన్న అఖిలప్రియను అరెస్టు చేసి పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందుగా నంద్యాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలని అనుకున్న పోలీసులు నిర్ణయం మార్చుకొని పాణ్యం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
రాత్రి ఏమి జరిగిందంటే
శ్రీశైలం నియోజకవర్గం నుంచి నంద్యాల నియోజకవర్గంలోని కొత్తపల్లిగ్రామంలోకి మంగళవారం లోకేష్‌ పాదయాత్ర ప్రవేశించింది. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు నంద్యాల టిడిపి నాయకులంతా తరలివచ్చారు. లోకేష్‌ వెంట గ్రామ స్థాయి టిడిపి నాయకులు, అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్‌రెడ్డి, ఎవి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్‌ఎండి.ఫరూఖ్‌ తదితరులు భారీ జనసమూహంతో ఆయన వెంట వెళ్తున్నారు. లోకేష్‌ విడిది ప్రాంతం చేరుకోగానే లోకేష్‌తో పాటు వెళ్తున్న అఖిలప్రియను తోసుకొని ఎవి సుబ్బారెడ్డి వెళ్లడంతో ఆమెకు ఎవి సుబ్బారెడ్డి చేయి తగిలింది. అఖిలప్రియ అనుచరులు ఆగ్రహం చెంది ఎవి సుబ్బారెడ్డిపై దాడికి దిగారు. భూమా అఖిలప్రియ, ఎవి.సుబ్బారెడ్డి వర్గీయులమధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎవి సుబ్బారెడ్డి కింద పడిపోయాడు. ఎవి సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు అందరిని చెదరగొట్టి ఎవి సుబ్బారెడ్డిని కారులో పంపించి వేశారు. ఆయన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన అంనతరం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఖిల ప్రియను అరెస్టు చేశారు.